mt_logo

తెలంగాణ వ్యవసాయ పథకాలు మాకూ అమలు చేయండి : కర్ణాటక రైతులు

తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అమలు చేస్తున పలు పథకాలను తమ రాష్ట్రంలో కూడా ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందని కర్ణాటక రైతులు అభిప్రాయపడ్డారు. మంగళవారం మైసూరులో ఏర్పాటు చేసిన రైతు సభలో తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారిలో జాతీయ రైతుసంఘం కార్యకర్త విమల్ కుమార్ పర్యటన అనతంతరం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ విమల్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ రైతు కుటుంబానికి రూ.10లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. ఈ సందర్బంగా జాతీయ రైతు సమాఖ్య కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ అధ్యక్షతన మైసూరులో ఏర్పాటు చేసినఈ సభలో పల్లా పాల్గొన్నారు. సిఎం కేసిఆర్ మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్ రూపంలో పల్లా ఈ వేదికపై విమల్ కుమార్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కర్నాటక రాష్ట్ర రైతులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలను ఎంతగానే మెచ్చుకుంటూ ఇటువంటి పధకాలు తమ రాష్ట్రంలో అమలు కావాలన్న అభిప్రాయాలను రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డితో పంచుకున్నారు. తమ రాష్ట్ర రైతు కుటుంబాన్ని ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్బంగా పల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతుబీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ తదితర పథకాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘాల సమాఖ్య నాయకులు నరసింహనాయుడు, ఖమ్మం రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *