నాడు..మండువేసవిలో హైదరాబాద్ నగరంలో ఏ గల్లీలో చూసినా నీటి ట్యాంకర్లే కనిపించేవి. ఏ ఇంట్లో విన్నా నీళ్లు లేవనే ముచ్చటే వినిపించేది. నీటి కటకటతో నగరవాసులు నిత్యం నరకం చూసేది. మేం హైదరాబాద్‌ను హైటెక్ సిటీ మార్చామని గొప్పలు చెప్పుకొన్న సమైక్య నాయకులు కనీసం నీటికొరతను తీర్చలేకపోయారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో మహానగరానికి జలహారం కట్టారు. కొత్త రిజర్వాయర్లు.. వేల కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణంతో ప్రతి నట్టింటికీ నల్లాల ద్వారా నీళ్లు నడిచొచ్చేలా చేశారు. తెలంగాణ సర్కారు సాధించిన ఈ జలవిజయాన్ని దగ్గరుండి చూసిన జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఎం దానకిశోర్ వివరించారు. తెలంగాణ మంచినీళ్ల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో జల జయకేతనం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకొందాం.
పంచభూతాల్లోకెల్లా ప్రధానమైన నీరు సమస్త జీవకోటికి ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవీ మనుగడ సాగించలేదు. కోటికి పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీకి జలమండలి తాగునీటిని సరఫరా చేస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. గతంలో నగరానికే పరిమితమైన జలమండలి సేవలు.. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ వరకు విస్తరించాయి. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి ఏపీలో బిల్లులు చెల్లించినా సరిపడా తాగునీరు అందించలేని స్థితి నుంచి ప్రస్తుతం నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తాగునీటి సరఫరాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పూనుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేకదృష్టితో మౌలిక సదుపాయాలైన తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, తదితర వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచించారు. దీంతోపాటు వాటిని అమలుచేయడానికి ప్రభుత్వ నిధులు సైతం సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లోనే రూ.338 కోట్ల వ్యయంతో 4 లక్షల మంది జనాభాకు ప్రయోజనం చేకూరేలా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 9 కొత్త రిజర్వాయర్లను నిర్మించింది. తర్వాత రూ.1900 కోట్లతో మరో 56 రిజర్వాయర్లతో పాటు 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టింది. దీనివల్ల నగర శివారు మున్సిపాలిటీల ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలు తొలగిపోయాయి. ఇక 2015లో ఇటు కృష్ణానది మూడో ఫేజ్, గోదావరి నది నుంచి మొదటి ఫేజ్ ప్రాజెక్టుల ద్వారా నగరానికి నీటి సరఫరా చేసింది.
హైదరాబాద్ మహా నగరానికి నిరంతర తాగునీటి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.710 కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్టును చేపట్టింది. దీనికోసం ఓఆర్‌ఆర్ చుట్టూ ఒక మణిహారంలా పైపులైన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నది. నగరానికి రెండువైపులా ఉన్న కృష్ణా, గోదావరి జలాలను వాటి ద్వారా సరఫరా చేయనున్నది. దీనికోసం ఇప్పటికే ఘన్‌పూర్ నుంచి పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు నుంచి కోకాపేట వరకు పైపులైన్ నెట్‌వర్క్ వేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఒక ప్రాంతంలో ఏదైనా సమస్య ఏర్పడితే, రెండో ప్రాంతం నుంచి తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ద్వారా హైదరాబాద్ నగర సముదాయాల ప్రాంతాల భవిష్యత్తు అవసరాల కోసం తాగునీటి భరోసా ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ రెండు, మూడు ఫేజ్‌లతో 20 టీఎంసీల నీరును తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
మండు వేసవిలోనూ నగరవాసులకు తాగునీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సుంకిశాల ఇన్‌టెక్‌వెల్ ప్రాజెక్టును చేపడుతున్నది. దీన్ని రూ.2,215 కోట్ల వ్యయంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే 2050 వరకు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. సాగర్‌లో నీటి నిల్వ డెడ్‌స్టోరేజీకి పడిపోయినా నీటిని వాడుకునే వీలుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటిని సరఫరా చేస్తున్నది. ఈ పథకం వల్ల జీహెచ్‌ఎంసీతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని 97 శాతం మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఇలా ఒకప్పుడు నగరానికి రోజుకి 300 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా చేసే స్థాయి నుంచి ప్రస్తుతం 602 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నాం. గతంలో తాగునీటి సరఫరా పైపులైన్ నెట్‌వర్క్ 5,300 కిలోమీటర్లు ఉంటే, నేడు 16,762 కిలో మీటర్లకు పెరిగింది. గతంలో మొత్తం 280 రిజర్వాయర్లు ఉంటే ప్రస్తుతం 597 రిజర్వాయర్లున్నాయి.
ఏ ప్రాంతంలోనైనా తాగునీటి సరఫరా తర్వాత మురుగునీటి నిర్వహణ కీలకం. ఇందులోనూ జలమండలి తనదైన ముద్ర వేసింది. మురుగు నీటి నిర్వహణలో మ్యాన్యువల్ నుంచి మెకనైజ్డ్ క్లీనింగ్ వరకు జలమండలి ఎదిగింది. పారిశుధ్య నిర్వహణలో మానవసహిత పనులకు స్వస్తిపలికి మొత్తం యంత్రాలతోనే నిర్వహిస్తున్న ఘనత సొంతం చేసుకున్నది. మ్యాన్‌హోళ్లలో దిగి కార్మికులు పనిచేయడాన్ని 2016లోనే నిషేధించింది. ఇందుకుగాను జలమండలి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రశంసలను అందుకుంది. మ్యాన్‌హోళ్ల క్లీనింగ్ కోసం 2017లో మినీ సీవర్ జెట్టింగ్ యంత్రాలను దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టింది. వీటిని ఆ కార్మికులకే ఇవ్వడం ద్వారా వారిని ఆ వాహనాలకు యజమానులను సైతం చేసింది. సీవర్ క్రాక్ రోబోటిక్ యంత్రాలు, పొల్యూషన్ రికగ్నిషన్ టెక్నాలజీ వంటి సాంకేతికతను అందిపుచ్చుకొని తెలంగాణ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
సీవరేజీ నిర్వహణలో చేపట్టే చర్యలు, మావన రహిత మ్యాన్‌హోల్ క్లీనింగ్ వంటి పలు సంస్కరణలకుగానూ జలమండలికి ‘అమృత్ టెక్నాలజీ చాలెంజ్’ అవార్డు అభించింది. దీన్ని 2018లో ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ వ్యాసకర్త, జలమండలి ఎండీ దానకిశోర్‌కు ప్రదానం చేసింది. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జలమండలి తీసుకుంటున్న చర్యలకుగానూ అదే ఏడాది Housing and Urban Development Corporation (HUDCO) అవార్డు లభించింది. సీవరేజీ జెట్టింగ్ యంత్రాలు ఉపయోగించి చేపడుతున్న సమర్థమైన మురుగు నీటి చర్యలకు తెలంగాణకు ‘ఎక్సలెన్స్’ అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని పలు పరిశ్రమలకు వేగంగా నీటి కనెక్షన్ మంజూరు చేసినందుకు 2019లో ‘టీఎస్ ఐపాస్’ అవార్డు వచ్చింది. బోర్డులో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న చర్యలు, మంచి పారిశ్రామిక సంబంధాలకుగానూ జలమండలికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ యాజమాన్య పురస్కారాన్ని అందజేయడం మా బాధ్యతను మరింత పెంచింది.