-మంత్రి కేటీఆర్ ఇలాఖాలో అత్యాధునిక విద్యా భవనం
రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలకు ఎంతో చరిత్ర ఉన్నది. ఈ స్కూల్‌లో చదువుకొన్న వారంతా ప్రస్తుతం గొప్పగొప్ప స్థానాల్లో ఉన్నారు. ప్రత్యేక నిర్మాణ శైలితో అందరినీ ఆకట్టుకొంటూ ఏండ్ల తరబడిగా ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న ఈ పెద్ద బడి భవనం శిథిలమైపోయింది. పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ సకల వసతులతో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గత సంవత్సరం ఏప్రిల్ 23న గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి కొండూరు సాంకేత్‌రావు ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధులతో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించారు. ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన ఈ పాఠశాలలో అంగన్‌వాడీ స్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకునేలా అద్భుత సముదాయాన్ని నిర్మించారు. 8.50 కోట్లతో పూర్తయిన పాఠశాలలో సకల వసతులు కల్పించారు. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు క్రీడామైదానం, గ్రంథాలయం, ప్రయోగశాలలు నిర్మించారు. ఈ నెల 20న విద్యా దినోత్సవం పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఈ బడిని ప్రారంభించనున్నారు.
అత్యాధునిక వసతులు
-పాఠశాలలో 48 కంప్యూటర్లతో మోడల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
-400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేందుకు అనువైన డైనింగ్ హాల్ నిర్మించారు.
-బాలురు, బాలికలు, సిబ్బందికి వేరువేరు టాయిలెట్లు, కిచెన్‌షెడ్లు, ఫిల్టర్ వాటర్ ప్లాండ్లు, డిజిటల్ బోర్డులు, రన్నింగ్ వాటర్, హ్యాండ్‌వాష్ సౌకర్యం కల్పించారు.
-ఫిజికల్, బయోసైన్స్ ల్యాబ్‌లు ఇదివరకే ఉన్నప్పటికీ మరిన్ని వనరులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
క్యూ కడుతున్న విద్యార్థులు
అద్భుతమైన పాఠశాల భవనం, నిపుణులైన బోధన, బోధనేతర సిబ్బంది, ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడడంతో తమ పిల్లల్ని పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పక్క మండలాల నుంచి కూడా వస్తున్నారు. రెండు రోజుల నుంచి ఉన్నత పాఠశాలలో 80, ప్రాథమిక పాఠశాలలో 40 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. తాము ఇదే పాఠశాలలో చదువుకొన్నామని, తాటాకు గుడిసెలు, చెట్ల కింద క్లాసులు విన్నామని, చేతిపంపు నీళ్లు తాగామని, పెద్దబడి కూల్చినప్పుడు చాలా బాధపడ్డామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య బావోద్వేగానికి గురయ్యారు. అలాంటి బడిని మళ్లీ చూడగలమా అనుకొన్నా ..కానీ మంత్రి కేటీఆర్ ఒక మంచి పాఠశాలను భావితరాలు గుర్తుంచుకొనేలా అందించారని ఆనందం వ్యక్తం చేశారు.