- రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు
- లక్ష ఎకరాలకు అందనున్న సాగునీరు
సమైక్య పాలకులు అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో సిరిసిల్ల ప్రాంతం వెనుకడిపోయింది. సాగునీరు దెవుడెరుగు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం విలవిల్లాడింది. ఇక్కడి ప్రజానీకం ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలసెల్లిపోయింది. కానీ తెలంగాణ సిద్ధించిన తర్వాత స్వపరిపాలనలో రూపురేఖలు మార్చుకున్నది. సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి కేటీఆర్ చిత్తశుద్ధితో మిడ్ మానేరు పూర్తై.. సగం సిరిసిల్లను తడిపేసింది. ఇప్పుడు చివరి ఆయకట్టుకూ నీరందించేందుకు కేటీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే మల్కపేట రిజర్వాయర్‌ను చకచకా పూర్తిచేయించారు. ఇప్పటికే మొదటి పంపు ట్రయల్ రన్ పూర్తికాగా, తాజాగా రెండో పంపు ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. రెండో పంపును గంటపాటు నడిపించారు. ఆదివారం వేకువజామున 12.40 నుంచి 1.40 గంట వరకు ట్రయల్ రన్ కొనసాగింది. గత 23న మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం కాగా, తాజాగా రెండో పంపు ట్రయల్ రన్ కూడా సక్సెస్ అవ్వడంతో మంత్రి కేటీఆర్ , జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తంచేశారు.
1500 కోట్లతో పక్కాగా ఎత్తిపోతల
ఎస్సారెస్పీ ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు అందించాలని ఇక్కడి మెట్ట ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, నాడు సమైక్య పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి కేటీఆర్ గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానం టూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు కాళేశ్వరం 9వ ప్యాకేజీలో ఎత్తిపోతల పథకాన్ని చేర్చారు. సిరిసిల్ల రామప్ప గుట్టల వరకు ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలను గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి ఎత్తిపోసే బృహత్తర కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. 1500 కోట్లతో భూగర్భ కాలువ, 3 టీఎంసీల రిజర్వాయర్‌ను నిర్మించారు. రామప్పగుట్ట నుంచి మొదలుకొని కోనరావుపేట మండలం మల్కపేట వరకు భూగర్భ కాలువ 12.3. కి.మీ పొడవు నిర్మించారు.
టన్నెల్‌కు సుమారు వెయ్యి కోట్లు కాగా, మల్కపేటలోని 3 టీఎంసీల రిజర్వాయర్‌కు సుమారు 500ల కోట్ల వరకు ఖర్చు చేశారు. 130 మీటర్ల లోతులోని సర్జ్‌పూల్ నుంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటర్లను బిగించగా, ఒక్కో మోటర్ 550 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నది. ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ మల్కపేట రిజర్వాయర్‌ను నిర్మించారు. 5 కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్‌లను నిర్మించారు. ఒక్కో బండ్ కిలోమీటర్ పొడవు ఉంటుంది. సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్ ప్రత్యేక ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
లక్ష ఎకరాలకు తడి
మల్కపేట రిజర్వాయర్ ట్రయల్న్ సక్సెస్ కావడంతో మెట్ట ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాల పంటకు నీరందనున్నది. మల్కపేట రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా ఎ ల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం చెరువు, గంభీరావుపేట మండలంలోని బట్టల చెరువుల వరకు కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బట్టల చెరువు నుంచి ఎగువ మానేరు ప్రాజెక్టులోకి కాలువ ద్వారా నీటిని తరలించే పనులు సైతం తుదిదశకు చేరుకున్నాయి.
సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకు పైగా సాగు నీరందనున్నది. అందులో సిరిసిల్ల మండలం లో 8,750, ఎల్లారెడ్డిపేట మండలంలో 29,875, గంభీరావుపేట మండలంలో 9,279, ముస్తాబాద్ మండలంలో 9,599, వేములవాడ అర్బన్ మండలంలో 7,805, రూరల్ మండలంలో 1,000, కోనరావుపేట మండలంలో 22,875, వీర్నపల్లి మండలంలో 6,967ఎకరాలకు సాగునీరందనున్నది. ఇందులో 60వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు 26, 150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.