
తెలంగాణలోని మహిళల ఓట్లను దండుకొనేందుకు కాంగ్రెస్ నేతలు సరికొత్త పథకాలతో ముందుకొచ్చారు. ఇటీవల ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆరు గ్యారంటీల పేరుతో ఓ కార్డును విడుదల చేశారు. ఇందులో మహిళలను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక పథకాలను డిజైన్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే సిలిండర్, మహిళల పేరుమీదే ఇందిరమ్మ ఇండ్లు అని అలవికాని హామీలు ఇచ్చారు. ఇప్పుడు తీరా పార్లమెంట్‌లో మహిళలకు రాజ్యాధికారం ఇచ్చే.. రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై ఓటింగ్ నడుస్తుంటే మాత్రం టీకాంగ్రెస్ ఎంపీలు బయటకు జారుకొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల టికెట్ల పంచాయితీ తెంపేందుకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌సహా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీనిపై మహాళాలోకం భగ్గుమంటున్నది. టీకాంగ్రెస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళా బిల్లు టీకాంగ్రెస్‌కు ఇష్టం లేదా?
చరిత్రాత్మకమైన మహిళా బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరుగుతుంటే టీకాంగ్రెస్ ఎంపీలు జారుకొన్నారు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీకాంగ్రెస్ వ్యతిరేకమా? అందుకే మద్దతు ప్రకటించలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళలకోసం వివిధ పథకాలు ప్రకటించి, తీరా మహిళలకు మేలుచేసే బిల్లుపై ఓటింగ్‌కు దూరమవుతారా? ఇదే నా మహిళల అభివృద్ధిపై చిత్తశుద్ధి? అని అతివలు నిలదీస్తున్నారు. ఓవైపు లోక్ చరిత్రాత్మకమైన బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే.. తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈ ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా బయటకు వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ ఎంపీలను ఈ గడ్డపై తిరగనివ్వబోమని మహిళలు శపథం చేశారు. కాగా, మహిళలకు క్షమాపణ చెప్పేవరకు వారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని పలువురు నేతలు పిలుపునిచ్చారు.