సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా అంటే నెర్రెలువారిన నేలలు.. ఎండిన పొలాలు.. ఊర్లకు ఊర్లే వలసలు.. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్న ప్రాంతంగా అందరికీ సుపరిచితమైన ప్రాంతం..2014కు ముందు పాలమూరు నిండా కన్నీళ్లే..ఏ గడప చూసినా వలస బతుకులే. తిండిగింజలకే కరువైన నేలలో ఇక చదువులంటే మోయని భారమే. అందుకే దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉందంటే ఆశ్చర్య వేయకు మానదు. ఇదంతా 2014కు ముందున్న దృశ్యం.
స్వరాష్ట్రంలో సిద్ధించాక సీఎం కేసీఆర్ విజన్‌తో తొమ్మిదేండ్లలో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. నెర్రవారిన నేలపై జలసవ్వడులు వినిపిస్తున్నాయి. ఎండిన పొలాలన్నీ పచ్చగా పండాయి. దీంతో వలసలు వాపస్ వచ్చినయ్. నాడు కన్నీటిసాగు చేసిన అన్నదాత నేడు.. మూడు పంటలూ పండిస్తూ దర్జాగా బతుకుతున్నాడు. చాలా కాలం పాలమూరు కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎస్ వెంకటరావు మారిన పాలమూరు ముఖచిత్రాన్ని చూసి మురిసిపోతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒకప్పుడు ఎండిన పాలమూరు నేడు ఎలా పండిందో చెప్తున్నారు.. మరి వలసల పాలమూరు.. తిరిగి ఇక్కడికే ఎలా వలసొచ్చిందో ఆయన మాటల్లోనే చదువుదాం.
మహబూబ్‌నగర్ జిల్లాలో 2014కు పూర్వం ఎటుచూసినా కొండలు, గుట్టలు, ఎడారిని తలపించే భూములు, నీళ్ల కోసం నోరు తెరిచిన బీళ్లు, ఎండిన చెరువులు, బావులు, కనుచూపుమేరలో కనిపించని నీరు, బతుకుతెరువు కోసం ఆరాటపడే జనం, ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలు, రెండు పూటలా తిండి దేవుడెరుగు, కనీసం ఒక పూట దొరికితే చాలు అనుకునే పరిస్థితి. సాగునీరు లేక, కనీసం తాగేందుకు చుక్క నీరు లేక, అక్షరం ముక్క రాక, దిక్కుతోచని పరిస్థితి పాలమూరు ప్రజలది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణ ,తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ చుక్క నీరు కూడా ఉపయోగించుకోలేని నిస్సహాయ స్థితి అక్కడి ప్రజలది.
రెండు నదుల మధ్య నడిగడ్డగా పేరు పొందినప్పటికీ సాగునీరు కాదు కదా కనీసం తాగడానికి కూడా గుక్కెడు మంచినీళ్లు లేక అల్లాడిపోయే జనాన్ని చూస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. అలాంటిది నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంతో అంతా మారిపోయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహబూబ్‌నగర్ లాంటి జిల్లా లోనే కాక ఇలాంటి ప్రాంతాలను బాగు చేసేందుకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. జలం కోసం, జనం కోరిక తీర్చేందుకు అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మహా యజ్ఞాన్ని చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా జలసంరక్షణ కార్యక్రమాలతోపాటు, హరితహారం, చెక్ డ్యాములు, ఊట కుంటలనిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో పనులను, కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చింది.
2014 కు పూర్వం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 14 లక్షల మంది ప్రజలు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. జిల్లాలో సాగునీరు,తాగునీరు లేక నిర్మాణరంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు కుదేలైపోయి పనులు దొరకక ప్రజలు అల్లాడిపోయేవారు.
స్వరాష్ట్రంలో సగౌరవంగా..
2014 తర్వాత పెను మార్పులు సంభవించాయి. మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌గా నా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన నీటిసంరక్షణ కార్యక్రమాల వల్ల భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయి. 2014 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు జిల్లాలో 8.89 మీటర్ల మేర భూగర్భ జలాల పెరుగుదల నమోదవటం అతి ముఖ్యమైన విషయం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడం, పూడిక తీయడం, ఆధునికీకరించడం ద్వారా జలసంరక్షణ కింద చిన్న చిన్న ఊట కుంటలు, అన్ని వాగులపై చెక్ డాములు నిర్మించి వర్షం ద్వారా పడిన ప్రతి నీటిబొట్టును ఉపయోగించుకునే విధంగా, భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో భూగర్భ జలాలు అనూహ్యంగా పెరిగాయి.
సాగు విస్తీర్ణం భళా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 నాటికి ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 3 లక్షల 62 వేల ఎనిమిది వందల ఎకరాలకు పెరిగింది. జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతోపాటు, పరిశ్రమలను కూడా ప్రోత్సహించటం వల్ల యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో వ్యవసాయ రంగంలో కూడా అత్యంత వేగంగా మార్పులు వచ్చాయి. రైతులు వరితో పాటు, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి వాణిజ్యపంటలతోపాటు, డ్రాగన్ ఫ్రూట్, క్యారెట్, క్యాబేజీ, అంజీర్ వంటి పండ్ల తోటలు, పూలతోటలు, కూరగాయలను కూడా పండిస్తున్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు మామిడి వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పాడి పరిశ్రమరంగం కూడా జిల్లాలో గణనీయంగా పెరిగింది.
పరుగులు పెడ్తున్న పారిశ్రామికం
2014కు ముందు జిల్లాలో అన్ని పరిశ్రమలు కలుపుకొని రూ. 1,199.63 కోట్ల పెట్టుబడితో 1700 యూనిట్లు ఉండగా, 10,993 మందికి ఉపాధి దొరికింది. ఇప్పుడు రూ.4,274 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల సంఖ్య 2,596కు పెరిగి 27,000 మంది ఉపాధి పొందారు. ఐటీ కారిడార్ రావటంతో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మార్గం ఏర్పడింది. అమరరాజా వంటి కంపెనీ రాకతో పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. హన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ పార్క్ వల్ల ఇంకా మరింత మందికి ఉపాధి దొరికే అవకాశం ఏర్పడింది. దీంతోపాటు, జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయటంలో భాగంగా ప్రత్యేకించి మహిళలు, యువతకు నైపుణ్య అభివృద్ధి సంస్థలను, కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చేందుకు ‘న్యాక్” వంటి సంస్థలను కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రతి వీధిలో మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి వాటితోపాటు, యువతకు నిర్మాణరంగంలో పనిచేసే నైపుణ్యాన్ని సాధించేందుకు ‘న్యాక్” ద్వారా శిక్షణ ఇప్పించే ఏర్పాట్లను చేపట్టారు.
జిల్లాలో మత్స్యశాఖ కూడా ఎంతో అభివృద్ధి సాధించి మత్స్యకారుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా 100% రాయితీపై అన్ని నీటి వనరులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పెంచుతున్నది .2016 నుంచి ఇప్పటివరకు సుమారు 1,017 లక్షల చేప పిల్లలను వదిలారు. మత్స్య పారిశ్రామిక సహకారసంఘాలను ప్రోత్సహించటం ద్వారా జిల్లాలో ఎన్నడూ లేని విధంగా చేపల ఉత్పత్తి పెరిగి ప్రజలకు అతి తక్కువ ధరలో చేపలు దొరికే అవకాశం కలిగింది.
వలసలు రివర్స్
వివిధ రంగాలలో నిరుద్యోగ యువతకు శిక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వలసలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకే వలసలు వస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. పనుల కోసం ఒడిశా, బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల నుంచి వేలాది మంది కూలీలు మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఎక్కడ చూసినా నీటితో కళకళలాడుతున్న పచ్చనిపంట పొలాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
అక్షరాస్యతలో కూడా జిల్లాలో ఎంతో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు మహార్దశను తీసుకువచ్చింది. మన ఊరు-మన బడి కింద రూ.116 కోట్ల ఖర్చుతో 291 పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీరు, ఫ్యాన్లు, డైనింగ్, కిచెన్ షెడ్లు, తాగునీటి నల్లాలు, పెయింటింగ్, గ్రీనరీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే సుమారు 190 పాఠశాలల్లో పనులు పూర్తికావస్తున్నాయి. మిగతా పాఠశాలల్లో కూడా త్వరలోనే పనులు పూర్తవుతాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా మన ఊరు-మన బడి కింద మంజూరైన పాఠశాలలు ఇంత పెద్ద మొత్తంలో పూర్తి చేసిన దాఖలాలు లేవని గర్వంగా చెప్పవచ్చు. విద్యారంగంతో పాటు, వ్యవసాయం, పాడి పరిశ్రమరంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ పరిస్థితి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్లనే అని నిస్సందేహంగా చెప్పాలి.