mt_logo

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య : సీఎం కేసీఆర్

దశాబ్దాల పాటు కొనసాగిన  తెలంగాణ  ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలన లోని ప్రగతి ప్రస్థానంతో నిలువరించగలిగామని, నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన  గోదావరి నదీ లోయ తదితర ప్రాంతాలు నేడు  కాళేశ్వరం జలాలతో పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  తెలిపారు. నాటి త్యాగాల ప్రతీకల స్థానంలో కొత్త ప్రగతి ఆనవాల్లు సంతరించుకున్నాయని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి (జూలై 4) సందర్భంగా అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు.

అమరుల ఆకాంక్షలను నిజం చేస్తూ ఉద్యమ లక్ష్యాన్ని సాధించుకుంటూ  కేవలం తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ సమాజానికి భవిష్యత్తు పట్ల ఒక భరోసాను నింపగలిగామని సీఎం వివరించారు. అన్ని రంగాలను పునరుజ్జీవింప చేసుకుంటూ తెలంగాణను పునర్నిర్మించుకుంటూ సాగుతున్న స్వయం పాలన దేశానికే ఆదర్శంగా నిలవడం వెనక అమరుల ఆశయాల స్పూర్తితో ఇమిడి వున్నదని సీఎం తెలిపారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం, వంటి సకల మౌలిక వసతులను తీర్చిదిద్దడం ద్వారా నేడు తెలంగాణ గుండె నిబ్బరంతో ఉన్నదన్నారు.  అభద్రతా భావాన్ని వీడి నేడు సబ్బండ వర్గాలు అభివృద్ధి పథంలో పయనిస్తూ సంతోషంతో జీవిస్తున్నాయన్నారు. అమరుల ఆశయాల సాధనే అత్యున్నత కర్తవ్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన కార్యాచరణతో సత్ఫలితాలు సాధిస్తున్నదని సీఎం అన్నారు. 

తెలంగాణ అమరుల మహోన్నత త్యాగాలను సమున్నతంగా గౌరవించుకునేందుకు, భవిష్యత్తు తరాలు, అమరుల త్యాగాల చరిత్రను నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ నడి గడ్డపై దశాబ్ధి ఉత్సవాల చారిత్రక సందర్భంలో “ తెలంగాణ అమర జ్యోతి”ని ప్రజ్వలనం చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అమరుల స్మారకం మనకు నిత్య స్పూర్తినందిస్తుందన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకునే దిశగా వారి  జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.