- కొంగొత్తగా కొల్లూరు టౌన్‌షిప్
- పంపిణీకి రెడీగా 15,660 ఇండ్లు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ గ్రేటర్‌లో డబుల్ సంబురం నెలకొన్నది. నిరుపేదల ఆత్మగౌరవం వెల్లివిరియనున్నది. వారి సొంతింటి కల సాకారం కానున్నది. గ్రేటర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పండుగకు ముహూర్తం సిద్ధమైంది. కొల్లూరులో నిర్మించిన 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను 22న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరులో రూ.1354.59 కోట్లతో ఎస్ ప్లస్ 9, ఎస్10, ఏ ప్లస్ 11 అంతస్తుల్లో 15,660 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్‌షిప్‌గా ప్రభుత్వం నిర్మించింది.
ఈ టౌన్‌షిప్‌ను మొత్తం 145.50 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులోని ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు. 117 బ్లాకుల్లో నిర్మించగా మౌలిక వసతుల కల్పనతో కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 8.65 లక్షలు ఖర్చు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి 30,412 మంది లబ్ధి పొందనున్నారు. మొత్తం 7,09,718 దరఖాస్తులను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ 3,54,967 దరఖాస్తులను సరైనవిగా తేల్చింది. దరఖాస్తు చేశాక వేరే ఊళ్లకు వెళ్లిపోయిన వారు, ఇచ్చిన ఫోన్ నంబర్లు పనిచేయని వారి దరఖాస్తులను పక్కనపెట్టింది. అర్హులకు మాత్రమే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇండ్లను అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది.