-బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ
-72వేల కోట్లకు చేరనున్న సాయం
-26 నుంచి రైతు బంధు పంపిణీకి సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో ఏ రైతు పెట్టుబడి డబ్బుల్లేక పంట వేయకుండా ఉండొద్దనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన పథకం రైతు బంధు. వ్యవసాయం కోసం పెట్టుబడిని నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీంను సీఎం కేసీఆర్ 2018 మే 10న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. రెండు పంటలకూ కలిపి ఎకరానికి పదివేల సాయం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని సూచించారు.
పోడు రైతులకు సాయం
పోడు రైతులకు కూడా ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. ఈ సీజన్‌లో పోడు పట్టాల పంపిణీ పూర్తి కాగానే, ఆ రైతులకు కూడా రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,50,224 మందికి 4 లక్షల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయనున్నారు. వీరికి పట్టాలు అందజేయగానే ఆయా రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానున్నది. ఇక పంట పంటకూ పోడు రైతులకు సాయం అందనున్నది.
66 లక్షల మంది.. రూ.7,500 కోట్ల నిధులు
‘రైతు బంధు’ పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ చర్యలను ప్రారంభించింది. కొత్త రైతుల వివరాలు సేకరించే పనిలో పడింది. సోమవారం (19వ తేదీ) వరకు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రైతుల వివరాలను తీసుకోనున్నది. నేడో రేపో సీసీఎల్‌ఏ నుంచి రైతుల జాబితా వ్యవసాయ శాఖకు అందనున్నది. దీని ఆధారంగానే పెట్టుబడి పంపిణీ చేయనున్నది. ఇక ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతులు రైతు బంధుకు అర్హులుగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో పెట్టుబడి సాయం కోసం రూ.7,500 వరకు నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
72 వేల కోట్లకు చేరనున్న సాయం
రాష్ట్ర, దేశ వ్యవసాయరంగంలో రైతు బంధు విప్లవాత్మకమైన పథకం. రైతుకు పెట్టుబడి భారాన్ని తప్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 2018లో శ్రీకారం చుట్టిన ఈ పథకం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతియేటా రూ.15వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నది. 2018 నుంచి గత సీజన్ వరకు 10 సీజన్లలో రైతుల ఖాతాల్లో రూ.65,192 కోట్ల భారీ మొత్తాన్ని జమ చేసింది. ఒక పథకం ద్వారా ఇంత భారీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం దేశం మొత్తంలో ఒక్క తెలంగాణ మాత్రమే. ప్రస్తుత వానకాలం సీజన్‌తో కలిపితే రైతు బంధు పంపిణీ సాయం రూ.72 వేల కోట్లకు చేరనున్నది.