mt_logo

గ‌వ‌ర్న‌ర్‌గారూ.. ఇదేం తీరు.. బ‌డుగుల‌కు ప‌ద‌విరాకుండా అడ్డుకుంటారా?.. త‌మిళిసైపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు

బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం సీఎం కేసీఆర్ అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. అన్ని రంగాల్లో వారికి పెద్ద‌పీట వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్య‌మ‌కారుల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. అయితే, ఇది బీజేపీకి న‌చ్చ‌డం లేదు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రూపంలో బ‌డుగుల‌ను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్న‌ద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. బ‌డుగు వ‌ర్గాల‌కు చెందిన దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ‌ను గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ మంత్రిమండ‌లి ప్ర‌తిపాదించ‌గా.. వారి అభ్య‌ర్థిత్వాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తిర‌స్క‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైంది. రాజ‌కీయ కోణంతోనే ఆమె ఈ ప‌నిచేశార‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బ‌డుగు, బ‌ల‌హీనవ‌ర్గాల‌కు మంచి మంచి ప‌ద‌వులు ఇస్తుంటే బీజేపీకి న‌చ్చ‌డం లేద‌ని, అందుకే గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టుకొని నాట‌కం ఆడుతున్న‌ద‌ని రాజ‌కీయ మేధావులు, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల ప్ర‌తినిధులు మండిప‌డుతున్నారు. 

ప్ర‌జా సేవ‌కులు ప‌ద‌వికి ప‌నికిరారా? 

దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయ నాయ‌కుల‌ని, వారికి సేవారంగంతో సంబంధం లేనందునే అభ్య‌ర్థిత్వాల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చెప్ప‌క‌నే చెప్పారు. అయితే, దేశ‌వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కుల‌కు ఈ కోటాలో ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింద‌ని, బీజేపీపాలిత రాష్ట్రాల‌కు ఒక నీతి.. తెలంగాణ‌కు ఒక నీతా? అని బీఆర్ఎస్ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. దాసోజు శ్ర‌వ‌ణ్ తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించార‌ని, బ‌డా బ‌డా కంపెనీల్లో ఉద్యోగం వ‌దులుకొని తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చేందుకు ఉద్య‌మంలోకి వ‌చ్చార‌ని, అది ప్ర‌జాసేవ కిందికి రాదా? అని గ‌వ‌ర్న‌ర్‌ను తెలంగాణ‌వాదులు ప్ర‌శ్నిస్తున్నారు.  ఇక కుర్రా స‌త్య‌నారాయ‌ణ 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా పోరాడి ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌స్వామ్య‌మ‌య్యార‌ని, అంత‌క‌న్నా ప్ర‌జాసేవ ఏముంటుంద‌ని నిల‌దీశారు. సమాజంలో అల్ప సంఖ్యాకులుగా ఉన్న కుర్రా సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం గవర్నర్‌కు ఎందుకు న‌చ్చ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇందులో రాజ‌కీయ కోణం ఉన్న‌ద‌ని మండిప‌డ్డారు. స‌ర్కారియా కమిష‌న్ సిఫార‌సుల ప్ర‌కారం రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్న‌వారు గ‌వ‌ర్న‌ర్ అయ్యేందుకు అర్హ‌త‌లేద‌ని, మ‌రి విద్యార్థిద‌శ‌నుంచే రాజ‌కీయాల్లో ఉన్న త‌మిళిసై ఎలా గ‌వ‌ర్న‌ర్ అయ్యార‌ని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. ఆమెకు నిబంధ‌న‌లు అడ్డురాలేదా? అని నిల‌దీశారు.