తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం అంటూ బీరాలు పోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇక్కడ గెలుపుపై ఆశవదులుకొన్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచనలో పడ్డది. సభలపేరిట రెండుసార్లు తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీకి సీన్ అర్థమైపోయింది. ఎన్ని ఎత్తులేసినా.. ఎన్ని హామీలిచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ముందు తమ పాచిక పారదని తెలుసుకొన్నారు. అందుకే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మీడియా ముందు తెలంగాణలో తమకు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్ నేతలు అయోమయంలో పడిపోయారు.
రాహుల్‌గాంధీ ఏమన్నారంటే?
రాహుల్‌గాంధీ ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో తమ పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ విషయం వచ్చేసరికి ఏమో తెలంగాణలో గెలువొచ్చు అంటూ ముక్తసరిగా చెప్పారు. ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన మొఖంలో ఆందోళన కనిపించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ గురించి చెప్పినప్పుడు మొఖంలో కనిపించిన హావభావాలకు.. తెలంగాణ విషయం మాట్లాడేటప్పుడు కనిపించిన ముఖ కవళికలకు చాలా తేడా కనిపించింది. దీంతో తెలంగాణలో తమ పార్టీ ఓటమి ఖాయమని రాహుల్‌గాంధీ చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన అన్ని అంశాలను పరిగణనలోకే తీసుకొని ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆదరణ చూసే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగి తేలాయి. సాక్షాత్తు అగ్రనేత గెలుపుపై అనుమానం వ్యక్తంచేయడంతో ఇక తామెలా ప్రజల్లోకి పోతామని తలలు పట్టుకొంటున్నారు.