mt_logo

దండుగ అన్న ఎవుసం నేడు పండగైంది.. పదేండ్ల పొద్దులో పచ్చని  పరిమళమైంది 

• 2 కోట్ల ఎకరాల మాగాణ… మన తెలంగాణ..

ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు…

• రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద..

• రైతన్నలకు అండగా ఠంచనుగా అందిన పెట్టుబడిసాయం..

రైతుబంధు నుంచి రైతు బీమా దాకా అన్ని రైతు పథకాలు…

• మద్దతు ధర నుంచి కొనుగోళ్ల దాకా … రైతన్న ప్రతి అడుగులో రాష్ట్ర సర్కారు..

• స్వరాష్ట్రంలో సగర్వంగా రైతాంగం..• పదేండ్ల పొద్దులో పచ్చని పరిమళాలు..

హైదరాబాద్, జూన్3: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది.  నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగపై ఆదారపడి బ్రతికే రైతుకు ఆర్థిక వెసులుబాటుకై, పంట అభివృద్ధికి పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది.  అనేక నూతన వ్యవసాయ పద్థతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి  తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది 

ఉద్యమ సమయంలో ఊరు, వాడ, పల్లె, పట్నం జిల్లాలో విస్తృతంగా తిరిగిన మన ముఖ్యమంత్రి శ్రీ. కె.చంద్రశేఖర్‌ రావు రైతుల సమస్యలు స్వయంగా చూశారు. రైతుల బాదలు ఆకళింపు చేసుకున్నారు.2014 జూన్ లో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ సారధిగా అభివృద్ధి సంక్షేమం పై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళిక రూపొందించి దశల వారిగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుటకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే రైతులు, వ్యవసాయరంగం సమస్యలపై దృష్టిసారించారు. దేశానికే వెన్నెముక్క అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహన్ని రూపొందించారు.. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తలపెట్టారు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. దీనికి గాను సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం 36 వేల 179 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో వినూత్న వరవడితో రైతుబందు పథకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయం చేస్తుంది. రైతులకు సాలీన  ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందచేస్తున్నది.

రైతు బంధు:- 

ఉమ్మడి రాష్ట్రంలో కరువు, పేదరికంతో అల్లాడిన తెలంగాణ రైతన్న.. సాగుకు పెట్టుబడి కూడా పెట్టలేని దుస్ధితికి చేరాడు. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీల బారిన పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పరిస్ధితిని తరిమికొట్టేందుకు సి.ఎం రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి ఏటా ఎకరాకు రూ.10 వేలు చొప్పున 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. 2018 వానకాలం సీజన్ నుంచి ఇప్పటికి వరకు 10 సీజన్లలో ఏకంగా రూ. 65.192 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇంత భారీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమే. 

రైతు వేదికలు:-

దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని ఆలోచించలేదు. రైతన్నల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాల క్లస్టర్ కు ఒకటి చొప్పున మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించింది. ఈ రైతు వేదికలు తెలంగాణ వ్యవసాయ ప్రగతి దీపికలై రైతన్నలకు మార్గదర్శనం చేస్తున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టు రైతన్నకు వరం:-

20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తో పాటు, మరో 20లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించడానికి ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ బహుళ దశల భారీ ఎత్తిపోతల పథకాన్ని వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి కేవలం మూడున్నరేళ్ళ స్వల్ప కాలంలో పూర్తిచేసారు. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తున ప్రవహించే గోదావరి నదిని భారీ పంపుల ద్వారా గరిష్టంగా 618 మీటర్లకు ఎత్తిపోయడం జరుగుతున్నది. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తెచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20 కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. 

తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసన సభలో  స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో  దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ  విరాజిల్లుతోంది.  రాష్ట్రంలో 1 కోటి 25లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం  త్వరలోనే సాకారం కానుంది.

నేడు రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా నీరు సరఫరా చేయబడుతున్నది.  2 కోట్ల పద్దెనిమిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత తొమ్మిది సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగింది. నేడు వరి ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రంలో తెలంగాణ పోటీపడుతున్నది.  దేశంలోనే అత్యధికంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండిoచిన మొత్తం వరి ధాన్యానికి మద్దతు ధరనిచ్చి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందిస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో విత్తనాల ధృవీకరణ చేస్తుంది. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. కల్తీ వ్యాపారులపై పి.డి. యాక్టు ప్రయోగిస్తున్నది.

రాష్ట్రంలో గోడౌన్ల సామర్థ్యం 9.9 లక్షల టన్నుల నుండి 31.9 లక్షల టన్నులకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఐదు వేల ఎకరాల భూమిని ఒక క్లస్టర్‌ గా విభజిస్తూ మొత్తం 2601  క్లస్టర్లలో రూ. 572 కోట్ల 88 లక్షల వ్యయంతో రైతు వేదికలను నిర్మించింది. ఆధునిక సేద్య పద్ధతులను క్షేత్ర స్థాయిలోకి తెచ్చి రైతులకు చేరువ చేయుటకు వ్యవసాయ విస్తరణ అధికారులకి 17 రకాల విధులను అప్పగించింది. వాణిజ్య పంటలు, కూరగాయలు వైపు రైతులను మళ్ళించుటకు వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నది. వ్యవసాయంలో అధిక దిగుబడి పొందేందుకు గాను రైతులకు సలహాలు సూచనలు చేయటానికి విస్తరణాధికారులను నియమించింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు:-

ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికీ  వెళ్ళి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటివరకు ఒక కోటి ఇరవై ఒక లక్షల కోట్ల విలువైన ఆరు కోట్ల డెబ్భై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.  కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పండిన పంటనంతా మద్దతు ధరతో కొని, సకాలంలో రైతుకు ధాన్యం అమ్మిన సొమ్మును అందజేయడంతో తెలంగాణ రైతు నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు. 

రాష్ట్రంలో 2013-14 లో ఒక కోటి ఎకరాలలో పంటలు సాగయితే, 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణా నేడు దేశంలో మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంట 34 లక్షల 97 వేల ఎకరాలలో మాత్రమే సాగుకాగా, 2022-23 నాటికి ఒక కోటి 21 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే, 247 శాతం పెరిగింది. 2014-15 లో పత్తిపంట 41 లక్షల 83 వేల ఎకరాలలో సాగుకాగా, 2022-23 లో 50 లక్షల ఎకరాలలో సాగయింది. అంటే 20 శాతం పెరిగింది.

ఇక పంటల దిగుబడి విషయానికి వస్తే, వరి ధాన్యం 2014-15 లో రాష్ట్రంలో వచ్చిన దిగుబడి 68 లక్షల టన్నులు కాగా, 2022-23లో దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడిని తెలంగాణ సాధించింది. అంటే, 341 శాతం పెరిగింది. అలాగే, పత్తి దిగుబడి 66 శాతం పెరిగింది.

పామాయిల్ పంటకు తెలంగాణ భూములు ఎంతో అనువైనవిగా ప్రభుత్వం గుర్తించింది. లక్ష కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న మన దేశంలో ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం. రైతులకు ప్రయోజనం కల్గించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 32 వేల ఎకరాలలో మాత్రమే  ఆయిల్ పామ్ పంట సాగయ్యేది. నేడు ఒక లక్షా ఐదువేల ఎకరాల్లో సాగవుతున్నది. ఈ పంట సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తున్నది.

కోటి ఎకరాలు పెరిగిన సాగు

తెలంగాణ రైతులకు సాగు అంటే సవాళ్లతో కూడుకున్న పని. వానాకాలం ఆ వానదేవుడు కరుణిస్తేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూమి బీడుగా ఉండేది. ఈ ప్రాంతంలో కోరలు చాచిన కరువు, సాగునీటి వసతి లేకపోవడమే కారణం. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసిఆర్ సాగునీటి గోస తీర్చడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే తొలుచ మిషన్ కాకతీయతో చెరువులకు పునరుజ్జీవం తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే పూర్తి చేసి గోదావరి జలాలను బీడు భూముల్లో పారించారు. దాంతో కరువు ప్రాంతం నీళ్లతో కళకళలాడుతున్నది. బీడు భూముల్లో పసిడి పంటలు పండాయి. సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపయ్యింది. 2014 -15 లో యాసంగి, వానాకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగువుతున్నాయి. 

వానకాలం, యాసంగి కలిపి మొత్తం సాగు విస్తీర్ణం (కోట్ల ఎకరాలు)

2014-15 లో – 1.31లక్షలు, 2015-16 లో – 1.21 లక్షలు, 2016-17 లో – 1.48 లక్షలు, 2017-18 లో – 1.50 లక్షలు, 2018-19 లో – 1.43 లక్షలు, 2019-20 లో – 1.88 లక్షలు, 2020-21 లో – 2.04 లక్షలు, 2021-22 లో – 1.95 లక్షలు, 2022-23 లో – 2.09 లక్షలు సాగు అయ్యింది.

నూతన వ్యవసాయ పద్ధతులతో పాటు రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం నేడొక లాభదాయక రంగంగా మారింది . నాణ్యమైన ఉచిత విద్యుత్త్‌, సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగం పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నది . రైతులు అధిక దిగుబడి పొంది ఆర్థికంగా ఎదుగుటకు దోహదం చేస్తుంది. నేడు దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ మారుటకు రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. తెలంగాణ రైతులు దేశంలోనే ధనిక రైతులుగా అభివృద్ధి చెందుతున్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో నేడు రైతుల లోగిళ్లు ధాన్యపురాసులతో కళ కళ లాడుతున్నాయి.