తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మహాగని మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ పచ్చ బడ్డది. ఏడెనిమిది ఏండ్ల నుండి మనందరం పట్టుబట్టి, జట్టుకట్టి బీడుబారిన తెలంగాణను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నాం. తెలంగాణలో ఈ రోజు 7.7 శాతం పచ్చదనం పెరిగింది. ఇదేదో మాటలు చెప్తే పెరగదు. తమాషాలు, కథలు చెప్తే కాదు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్ళు తెచ్చే బాధ్యత నాది అని మీ బిడ్డగా హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు తన ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలని చాలా తపనతో ఉన్నారు.
నీళ్ళ కోసం అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని నాకు తెలుసు. రాబోయే మూడు నాలుగు నెలల్లో మీరు మార్పును చూడబోతున్నారు. మీకో తీపి కబురు చెప్తున్నాను. కృష్ణా నదిలో నీళ్ళ కోసం పంచాయితీ ఉంది. కానీ గోదావరి నదికి సంబంధించి ఈ పంచాయితీ లేదు. గోదావరి నీళ్ళు మన హిమాయత్ సాగర్, గండిపేట వరకు లింక్ కాబోతున్నాయి. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఇక్కడి ప్రాంతాలకు కూడా నీళ్ళిచ్చే అవకాశం ఉంది. కిందనే కొండపోచమ్మ సాగర్ నుండి మూసీ నది నీళ్ళు దాటిస్తే నీళ్ళు దాదాపు లోయపల్లి దాకా వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారు. కృష్ణ లో నీళ్ళు తక్కువ బడినా, గోదావరి నది నుండైనా ఇచ్చి ఈ ప్రాజెక్టును ఆదుకోవాలనే చర్చ జరుగుతున్నది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి నీటిని తెస్తా అని నేను మనవి చేస్తున్నాను. మీరు చింతించాల్సిన అవసరం లేదు అంటూ సీఎం ప్రసంగించారు.