తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18 వ రోజున తలపెట్టిన ‘తెలంగాణ హరితోత్సవం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మహాగని మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. హరితహారంతో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అటవీ శాఖ అధికారులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పచ్చదనాన్ని పెంపొందించడంలో రెండు దేశాలు గొప్ప ప్రయత్నాలు చేశాయి.
చైనా దేశంలోని గోబి ఎడారి విస్తరణ ను అరికట్టేందుకు ఈ దేశ ప్రజలు పట్టుబట్టి 500 కోట్ల మొక్కలు నాటారు. తగ్గుతున్న పచ్చదనాన్ని పెంపొందించేందుకు బ్రెజిల్ దేశంలో 300 కోట్ల మొక్కలు నాటి ఫలితాలు సాధించారు. ఇవ్వాళ తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలను మనం ఇప్పటికే నాటాం. మనం చాలా అడ్వాన్స్ డ్ గా ఉన్నాం. ప్రతి ఊరిలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు వాటిలొ ఓపెన్ జిమ్ లున్నాయి. అర్బన్ పార్కులు గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఇప్పటికే 170 అర్బన్ పార్కులు పూర్తయ్యాయి. ఇంకా రూపుదిద్దుకొంటున్నాయి. ఇది మనందరి విజయం. మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం నుండి ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టమని నేను చీఫ్ సెక్రటరీ గారితో చెప్పాను. ఇది కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి గారి డిమాండ్లను నెరవేరుస్తాం. మహేశ్వరం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేస్తాం. తుమ్మలూరు సబ్ స్టేషన్ ను కూడా మంజూరు చేస్తాం. వీలయినంత త్వరగా పూర్తి చేస్తాం.మెట్రోని కూడా ఇక్కడి దాకా విస్తరించాలనే డిమాండ్ దృష్ట్యా మహేశ్వరానికి మెట్రో తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని అన్నారు.