వరంగల్: తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్ పట్టణమే వేదికగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. ‘వరంగల్ ఈస్ట్ & వెస్ట్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర యొక్క వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్నటువంటి వరంగల్ వీరభూమికి నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ వరంగల్ ఉద్యమంలోనే జరిగిందని అన్నారు.
భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నం. అమ్మవారికి కిరీట ధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్నానని తెలిపారు. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చెరువుల బాగుకోసం ‘మిషన్ కాకతీయ’ పేర్లను పెట్టడం వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవమే కాకుండా కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఉద్యమాన్ని నేను తలెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీకి, అండగా నిలిచిన ప్రొ.జయశంకర్ సర్ లను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. ఎన్నికల్లో ఈ వరంగల్ సభ నాకు 95వదని తెలిపారు. తెలంగాణను అన్ని రకాలుగా అరిగోస పెట్టిందే, అన్ని రకాలుగా ఏడ్పించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. 1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందీ కాంగ్రెస్ పార్టీయే.1969 లో తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందీ కాంగ్రెస్ పార్టీయే. ఉద్యమం సమయంలో సమైక్యవాదులతో మానుకోటలో మీటింగ్ పెడుతామని తెలంగాణ ప్రజలపై తుపాకులు, రాళ్ల దాడి చేసినోళ్లే మళ్లీ ఇవ్వాల మనపై ఎన్నికల్లో పోటీగా నిలబడ్డారని ఎద్దేవా చేసారు.
నాడు వరంగల్‌లో నీళ్లు ఎన్ని రోజులకోగానీ వస్తుండేవి కాదు. ఇయ్యాల మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తావున్నయన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో నిజాం స్థాపించినటువంటి అజాంజాహీ మిల్లును ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఆ భూములను రియల్ ఎస్టేట్ కింద అమ్ముకున్నరు.వరంగల్ దగ్గరలోని గీసుకొండ ప్రాంతంలో బ్రహ్మాండమైన టెక్స్ టైల్ పార్క్ పెట్టుకున్నం. పెద్ద కంపెనీలు వచ్చాయి. రెండేండ్లలోపు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
దుమ్మూ, ధూళి ఉండే వరంగల్ నిర్మాణంలో మంచి రోడ్లు, మౌలిక వసతులు జరుగుతావున్నయి. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా, జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలుగా మార్చుకుంటూ వస్తున్నాం. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో కాకుండా వరంగల్‌లో స్థాపించుకున్నామని అన్నారు. చిన్నబోయిన వరంగల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. వరంగల్‌లో రైల్వే లైన్లపై 6 బ్రిడ్జిలను నిర్మాస్తామని మాట ఇస్తున్నాను. బైపాస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. రింగ్ రోడ్డు కూడా పూర్తయితే అద్భుతంగా ఉంటుంది.హైదరాబాద్‌తో వరంగల్ పోటీ పడాలనుకుంటున్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కోరిక సముచితమైనది. పనిచేసేవాళ్లకు అలాగే ఉంటదన్నారు.
తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ కూడా రెండవ ఐటీ కేంద్రంగా అవుతుంది. పరిశ్రమలు, డైరీ యూనిట్లు, ఇతర ఆధునిక వసతులను కల్పించి వరంగల్‌ను ఉజ్జ్వలమైన నగరంగా చూడాలని నాకున్నది. వరంగల్‌లో ఆకాశాన్నే ముద్దుపెట్టుకునేలా తయారవుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డింగ్ ఒక్కటే వినయ్ భాస్కర్, నరేందర్‌లను గెలిపించడానికి చాలన్నారు. హైదరాబాద్ నుంచే వరంగల్‌కు వచ్చి చికిత్స చేసుకునే విధంగా ఉంటుంది హాస్పిటల్. భారత దేశంలోనే ఇటువంటి 24 అంతస్తుల హాస్పిటల్ ఎక్కడా లేదని సూచించారు.
వినయ్ భాస్కర్, నరేందర్‌లు ఇద్దరూ మీ చేతుల్లో పెరిగిన స్వంత బీసీ బిడ్డలు. ‘దాస్యం మా ధైర్యం’ అని ఆటోరిక్షావాళ్లు కూడా రాసుకుంటరు. కార్మికులు, సామాన్య ప్రజలతో మమేకమై పనిచేస్తారు. వరంగల్ ఉమ్మడి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కొరారు.