mt_logo

బీజేపోల్లు గెలిస్తే ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాలు”: హుజూరాబాద్ సభలో సీఎం

బీజేపోల్లు గెలిస్తే వట్టియే మాటలు తప్పా ఏం రాదన్నారు. ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాల’’ మాదిరిగా ఉంటదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హుజూరాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. బీజేపాయెన మొన్న గెలిస్తే ఏమన్నా అయిందా ఏకాన పని.. ఇక పెద్ద పెద్ద మాటలు..‘‘ఎల్లయ్యకు ఎడ్లు లేవు..మల్లయ్యకు బండి లేదు’’ అని స్పష్టం చేసారు. తెలంగాణలో వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తున్నదని ధీమా వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీలకు ప్రజల పట్ల ఉన్న బాధ్యత ఏంటి.. వాటి వైఖరేంటని ఆలోచించి వివేచనతో ఓటు వేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే బీఆర్ఎస్ పుట్టింది. కాంగ్రెస్, బీజేపీల చరిత్ర ఏమిటి? వాళ్ల వైఖరి మన తెలంగాణ రాష్ట్రం మీద ఏమున్నదో ఆలోచించి ఓటేయాలని సూచించారు.

‘‘ఎల్లయ్యకు ఎడ్లు లేవు..మల్లయ్యకు బండి లేదు’’

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే 24 గంటల కరెంటు ఉంటదని తెలిపారు. ‘కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే కుదురుతుందా?’ ఆలోచించాలని అన్నారు. ఇవ్వాల కాంగ్రెసోళ్లు ‘ధరణి’ తీసేసి భూమాత అని తీసుకొస్తరట. ‘ధరణి’ బంద్ అయితే రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోళ్ల  డబ్బులు ఎలా వస్తయి? అని ప్రశ్నించారు. గవర్నమెంట్ దిక్కున్న కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిదా? లేకుంటే వేరేటోళ్లు గెలిస్తే మంచిదా? అనేది దయచేసి ఆలోచించాలి అని కోరారు. బీఆర్ఎస్‌కు తప్ప వేరే ఎవరికేసినా మీ ఓటు మోరీల వేసినట్టే అయితది. లేకుంటే ఓటు మురిగిపోతదని తేల్చి చెప్పారు. 

కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి 

హుజురాబాద్‌కు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు.. మీ కాల్వలకు లైనింగ్ చేయించలేదా.. మునుపు వారబందీలు బంద్ పెట్టి కాల్వనిండా నీళ్లు వస్తలేవా.. మీ దగ్గర ధాన్యం కొంటలేరా.. మీకు రైతు బంధు వస్తలేదా.. మీ దగ్గర దళిత బంధు అన్ని ఇండ్లకు రాలేదా? అని అడిగారు. హుజురాబాద్‌కు ఎన్నో చేసిన కేసీఆర్‌ను కాదని ఎవరినో ఎత్తుకుంటే ప్రజలకు వచ్చేదేమున్నదో ఆలోచన చేయమన్నారు. పాడి కౌశిక్ రెడ్డి యువకుడు..ఉత్సాహవంతుడు..ఆయనకు ఒక అవకాశం ఇవ్వండని కోరారు.  

‘పాలిచ్చే బర్రెను వదిలేసి..దున్నపోతును తెచ్చుకుంటరా’?

ఆనాడు తెలంగాణ ఉద్యమంల ఈటల రాజేందర్ కూడా లేని నాడు గులాబీ జెండాను కౌశిక్ రెడ్డి తండ్రి  మోసిండని వెల్లడించారు. హైదరాబాద్‌లో నాతోనే ఉండే కౌశిక్ రెడ్డి నా కొడుకులాంటోడు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజురాబాద్‌కు అన్ని రకాలుగా నేను అండదండలుగా ఉంటానని హామీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి కొన్ని మండలాలు కావాలని, మిగిలిన పనులన్నింటినీ నేను వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కరిస్తానన్నారు. గతంలో ఒకసారి మీరు నన్ను బాధ పెట్టిండ్రు. ఫర్వాలేదు, ఆ రోజు అలా జరిగిపోయింది. ఎవరైనా ‘పాలిచ్చే బర్రెను వదిలేసి..దున్నపోతును తెచ్చుకుంటరా’? అని అడిగారు. కారు గుర్తుకు ఓటేసి పాడి కౌశిక్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు.