రేవంత్ రెడ్డి నోట్లెకెళ్లి ఏదిపడితే అది మాట్లాడితే అయిపోతదా? నీది నెత్తా..కత్తా? అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పరకాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. రైతులకు 3 గంటలు చాలంటడు పీసీసీ అధ్యక్షుడు. 3 గంటల కరెంటు ఇస్తే రైతుల పొలాలు పండుతాయా? అని ప్రశ్నించారు. రైతుల దగ్గర 3 లేదా 5 హెచ్.పి.మోటార్లు ఉంటయి. 30 లక్షల మోటార్లకు 10 హెచ్.పి.మోటార్లు పెట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలయితవి. అన్ని డబ్బులు వాళ్ళ అయ్య ఇస్తడా? అని ఎద్దేవా చేసారు. 30 లక్షల మోటార్లు ఎవరు మార్చాలె అని సీఎం ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నికలు మూడోసారి జరుగుతున్నయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని సూచించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వేస్ట్ అంటున్నడు. ప్రజలేమో కావాలంటున్నరు. ప్రజలకేది అవసరమో కేసీఆర్ అదే చేస్తడని తెలిపారు. పరకాల చల్లా ధర్మారెడ్డి గెలిస్తే రైతుబంధు పదివేల నుంచి పదహారు వేలకు పెరుగుతుందని సీఎం చెప్పారు.
రైతుబంధును ఉంచి రేపు పదహారు వేలకు పెంచే బీఆర్ఎస్ కావాల్నా? వాళ్లు కావాల్నా? ఆలోచన చేయండని కోరారు. గిరిజన బిడ్డలకు కేసీఆర్, బీఆర్ఎస్ తప్ప ఎవరన్నా వాళ్ల తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రా? అని ప్రశ్నించారు. పర్కాల నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయే ‘కాకతీయ టెక్స్ టైల్ పరిశ్రమ’తో స్థానిక యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తయని వివరించారు. పరకాలలో కోర్టు అవకాశముంటే తప్పకుండా చేస్తా సీఎం తెలిపారు.
మేం పదేండ్లు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావాల్నా? ఇదే ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్ యే ఉండాల్నా? ప్రజలు చర్చించి నిర్ణయించాలని కోరారు. బీఆర్ఎస్ చేసిన మంచి పనులన్నీ మీ కండ్ల ముందే ఉన్నవని తెలిపారు. కేసీఆర్ బతికున్నంత వరకు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వమే ఉంటదని తేల్చి చెప్పారు. చల్లా ధర్మారెడ్డి నా దగ్గరికి ఎప్పుడొచ్చినా చలివాగు ప్రాజెక్టులు, వాగులు, దేవాదుల నీళ్లు, ఎస్సారెస్పీ నీళ్లు నియోజకవర్గ విషయాల గురించే తప్ప వ్యక్తిగత పనులు అడగలేదని వెల్లడించారు. చల్లా ధర్మారెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించండి..పరకాలకు ఏం కావాలన్నా నేను చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.