mt_logo

ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెసోళ్లు మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు: చొప్పదండి సభలో సీఎం కేసీఆర్

భూభారతి అని కాంగ్రెసోళ్లు 30 ఏండ్ల క్రితమే తెచ్చినా ఏం కాలేని సీఎం కేసీఆర్ తెలిపారు. చొప్పదండి ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిన అభివృద్దినీ  చూసి ఓటెయ్యాలని సూచించారు. ఎమ్మెల్యేలచే హైదరాబాద్‌లో మన ప్రభుత్వం ఏర్పడుతది కాబట్టి ఓట్లను జాగ్రత్తగా వేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కనిపిస్తయని పేర్కొన్నారు. 

రూ. 200 మొఖాన కొట్టి గిదే పెన్షన్ అన్నరు 

చొప్పదండి నియోజకవర్గంలో నాడు రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి బోర్లు వేసీ వేసీ.. చివరికి ఏసిన బోరుకాడనే ప్రాణం విడిచిన సంగతి మనకు తెలిసిందే అని గుర్తు చేసారు. నాటి కాంగ్రెస్ పాలనలో తాగునీళ్లు, సాగునీళ్లు, కరెంటు లేదు..ప్రజల సంక్షేమం లేదు. ఓ రెండు వందలు మొఖాన కొట్టి గిదే పెన్షన్ అన్నరు. నాటి 58 ఏండ్ల కాంగ్రెస్ పాలన.. నేటి కేవలం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని వాస్తవాలను తెలుసుకొని ప్రజలు ఓట్లేస్తే మంచి జరుగుతదని అన్నారు. కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం చొప్పదండి. వెయ్యి కోట్ల రూపాయలతో కొండగట్టు అంజన్న దేవాలయాన్ని తీర్చిదిద్దుకుంటాం. రవిశంకర్, వినోద్ కుమార్‌లు కూడా అడిగిండ్రని వెల్లడించారు.  కొండగట్టు అంజన్న చల్లని దీవెనలు మనందరిపైన ఉండాలని  ప్రార్ధించారు. 

మనం ఇస్తుంటే కాంగ్రెస్ వేస్ట్ అంటుర్రు 

నాడు చొప్పదండిలో వరదల కాలువలతో ఎన్నో ఇబ్బందులు ఉండేదని తెలిపారు. మన మోటార్లను కోసి అదే కాలువలో ఎత్తేసేదని గుర్తు చేసారు.  కాంగ్రేసోల్లు ఉన్నప్పుడు రైతులకు నయా పైసా ఇవ్వలేదు కానీ.. మనం ఇస్తుంటే మాత్రం రైతు బంధు వేస్ట్ అంటున్నరు అని ధ్వజమెత్తారు. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని ఇవ్వాల కాంగ్రెసోళ్లు మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రని పేర్కొన్నారు. ఇవ్వాల ధరణితో భూముల పంచాయతీలు లేవు.. ప్రజల బొటనవేలుతో మాత్రమే మారేలా ప్రజల భూములకు బీఆర్ఎస్ ప్రభుత్వం హక్కునిచ్చిందని వివరించారు.  భూభారతి’ అని కాంగ్రెసోళ్లు 30 ఏండ్ల క్రితమే తెచ్చినా ఏం కాలేదని తేల్చి చెప్పారు. ఇవ్వాల ధరణి’ తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, పంట కొనుగోలు డబ్బులు ఒక్కపైసా తగ్గకుండా ఎలా వస్తున్నయో చూడండని అన్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యం వస్తదని హెచ్చరించారు. 

భుజం తట్టి ముందుకెళ్లమని ఆశీర్వదిస్తున్న ప్రజలు 

బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల ముందు చర్చ పెట్టాలని సీఎం కోరారు. సుంకె రవిశంకర్‌ను గెలిపించండి.. వెంటనే గోపాల్రావు పేట, గర్షకుర్తి మండలాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మన ప్రజా ఆశీర్వాద సభలకు ఎక్కడికి పోయినా ప్రజలు అంచనాలకు మించి తండోపతండాలుగా వస్తున్నరు. భుజం తట్టి ముందుకెళ్లమని ఆశీర్వదిస్తున్నారని ఆనందపడ్డారు. చొప్పదండిలో సుంకె రవిశంకర్‌ను కూడా దీవించి కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నానని పేర్కొన్నారు.