mt_logo

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రమాదం జాగ్రత్త: భూపాలపల్లి సభలో సీఎం కేసీఆర్

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రమాదం జాగ్రత్త అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత , సీఎం మాట్లాడుతూ..  ఎవరి చేతిలో రాష్ట్రం ఉంటే బాగుంటుందో చూడాలన్నారు. వ్యక్తుల చరిత్ర చూడాలి. వారి వెనుక ఉన్న పార్టీ చరిత్ర చూడాలని సూచించారు. 15 సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. మంచినీటి సమస్య తీర్చుకున్నాం. వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దుకున్నాం అని వివరించారు. పేదలకిచ్చే పెన్షన్‌ను ఎన్నికల తర్వాత 3 వేలు చేసి 5 వేలు తీసుకొని వెళ్లబోతున్నాం అని వెల్లడించారు. ఉచితంగా 24 గంటల కరెంటు నాణ్యమైనది సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

కాంగ్రెస్ వస్తే కష్టం 

పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొంటున్నదని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే రైతుబంధును ఎకరాకు రూ.16 వేలు ఇస్తామని ప్రకటించారు. కత్తి ఒకరికి ఇచ్చి మరొకరిని పోరాటం చేయమంటే సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తే రైతులకు జీవన్మరణ సమస్య ఎదురవుతుంది. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు ఎట్లా రావాలే? కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట! కడుపుల చల్ల కదలకుండా ఎవరికి లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులో డైరెక్టుగా డబ్బులు వచ్చి పడ్తున్నాయి. కాంగ్రెస్ వస్తే కష్టమవుతుందని హెచ్చరించారు. 

భూపాలపల్లి జిల్లా చేసిందే కేసీఆర్.. 

సింగరేణిని ముంచింది కాంగ్రెస్ పార్టే. అప్పులు తెచ్చి కట్టలేక కేంద్రానికి 49 శాతం వాటా ఇచ్చింది కాంగ్రెస్ పార్టే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగులు వద్దని సంతకాలు పెట్టింది కాంగ్రెస్ వాళ్లు అని గుర్తు చేసారు. సింగరేణి చరిత్రలో 1000 కోట్ల రూపాయలు కార్మికులకు వాటా పంచిండ్లా? మన ప్రభుత్వంలో లాభాల్లో కార్మికులకు 32 శాతం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా చేసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. వెంకట్రమణారెడ్డి గెలిస్తేనే లాభం జరుగుతుంది. వర్షంలో సభకు హాజరైనట్లే 30న కూడా ఇలాగే పెద్ద మొత్తంలో హాజరై వెంకట్రామణారెడ్డిని గెలిపించండని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.