mt_logo

ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదు: సీఎం కేసీఆర్ 

అందోల్: జోగిపేటకు నేను ఎప్పుడ వచ్చినా ఒక పులిలాగా ఉండే మాణిక్ రెడ్డి లేకపోవడం సీఎం కేసీఆర్ బాధగా ఉందన్నారు. ‘అందోల్’ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రైతు బంధు’ ఉండాలంటే అందోల్‌లో చంటి క్రాంతి కిరణ్ గెలువాలని అన్నారు.  నేను మంత్రిగా ఉన్న టైంలో జోగిపేటలో గల్లీ గల్లీ, బస్తీ బస్తీ తిరిగి చేయాల్సినంత అభివృద్ధి చేసినానని పేర్కొన్నారు. 

సింగూరు జలాలు కాంగ్రెస్ పాలనలో ఎందుకు రాలేదు? అని అడిగారు. సమైక్యవాద పాలకులు మన నోరు కొట్టి ఘనపురం ఆయకట్టు, నిజాం సాగర్ ఆయకట్టును ముంచి సింగూరును హైదరాబాద్ మంచి నీళ్లకని పెడితే ఒక్క కాంగ్రెసోడు నోరు తెరువలేదని ఆరోపించారు. ఇక్కడున్న దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నీళ్లు ఎందుకు తేలేదు? అన్నారు. 

సమైక్య పాలనలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యను..ఏం చేసుకుంటరో చేసుకోపో అన్నడు. హరీశ్ రావు, మనోళ్లంతా పేగులు తెగేదాక కొట్లాడుతుంటే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా కొట్లాడిండా? అని ప్రశ్నించారు. ఆనాడు దామోదర రాజనర్సింహ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మంత్రి పదవి చేపట్టి అసెంబ్లీలో కూర్చున్నడు గానీ అడగలేదని తెలిపారు. ధరణి తీసేస్తం, 3 గంటల కరెంటునిస్తం, రైతుబంధు వేస్ట్ అంటామన్నా కాంగ్రేసోళ్లకి ఓట్లు వేయాల్నా? పొరపాటున కాంగ్రేసోళ్లు గెలిస్తే ఢిల్లీకి హైదరాబాద్‌కి తిరగడానికే సరిపోతది గానీ ప్రజల సమస్యలు పట్టవని హెచ్చరించారు. 

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు, సింగూరుకు కాళేశ్వరం లింక్‌లతో అందోల్ నియోజకవర్గంలో ఒక లక్షా డెబ్బై అయిదు వేల ఎకరాలకు తక్కువ వ్యవధిలో సాగునీళ్లు వస్తయని తెలియజేసారు. రెవెన్యూ డివిజన్‌ను చేసిన. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చేది? అని అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి రాజ్యమే. దాంతోనే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

మన తెలంగాణ మనకు రాకుండా చేసింది ఇందిరమ్మ రాజ్యమే. దళిత జాతి అనేక వేల ఏండ్లుగా అణచబడినవాళ్లు. వెనుకేయబడ్డవాళ్లు. ఇందిరమ్మ రాజ్యంలో ‘దళిత బంధు’ లాంటి పథకం పెడితే ఇవ్వాల దళితుల్లో ఇంత దుస్థితి ఉండేది కాదన్నారు. ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు చేయించే బాధ్య‌త నాది అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.