కాంగ్రెస్ అంటేనే కలహాలు.. కొట్లాటలు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రస్థాయిలో సీనియర్లు, జూనియర్ల పంచాయతీ నడుస్తున్నది. రేవంత్‌వర్గం ఓ వైపు.. ఆదినుంచీ కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు మరోవైపు ఉండి ఒకరిపై ఒకరు కుట్రలు, కుతంత్రాలు చేసుకొంటున్నారు. బయటకు తామంతా కలిసే ఉన్నట్టు నటిస్తూ అంతర్గతంగా కుమ్ములాటలకు దిగుతున్నారు. తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ ఇప్పటికే చెప్పకనే చెప్పారు. ఆయన పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగడంతో.. తాజాగా, ప్రెస్‌మీట్ పెట్టిమరీ తాను ఎక్కడి వెళ్లడం లేదు మహాప్రభో అని చెప్పుకోవాల్సి వచ్చింది. తాను హుజూర్‌నగర్‌నుంచి.. తన భార్య కోదాడ నుంచి పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. అయితే, కుటుంబంలో ఒకే టికెట్ అనే నినాదంతో ఉత్తమ్‌కు రేవంత్‌రెడ్డి చెక్ పెట్టాలని చూస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఉత్తమ్‌కూడా తనపై కావాలని కీలక పదవిలో ఉన్న పార్టీ నేతే దుష్ర్పచారం చేస్తున్నారని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ గొడవ ఇప్పుడు జిల్లాస్థాయికి కూడా చేరుకొన్నది.
సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల కుమ్ములాట
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు రంగు బయటపడింది. సిరిసిల్ల జిల్లా హస్తం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
సీనియర్ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, ఉమేశ్‌రావు సాక్షిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. కొంతమంది యువకులను ఉమేశ్‌రావు పార్టీలో చేర్చుకోగా, తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా చేర్చుకొంటారంటూ ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి గొడవకు దిగారు. చొక్కాలు పట్టుకొని, కొట్టుకొన్నారు. పార్టీ కార్యాలయంలోని కుర్చీలను పైకెత్తి విసిరేశారు. అయితే, ఇరువర్గాలను శాంతింపజేయాల్సిన సీనియర్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఉమేశ్‌రావు అక్కడినుంచి మెళ్లగా జారుకోవడం గమనార్హం.