తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచం నివ్వెరపోయేలా తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్
సూర్యాపేటలో ఈ రోజు చక్కటి అధికార భవనాలు సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో నిర్మింప చేసుకుని నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు సూర్యాపేట జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు నా అభినందనలు తెలిపారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర. ఇది 23 వ జిల్లా కలెక్టరేట్. 24 వ జిల్లా కలెక్టరేట్ ను కూడా త్వరలో మెదక్ జిల్లాలో ప్రారంభించుకోబోతున్నం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తమమైన పనితీరును ప్రదర్శిస్తూ.. మన అందరం చేసిన కృషి ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా మానవాభివృద్ధి సూచికలో, సంపదకు సంబంధించిన సూచిక వంటి అంశాల్లో అభివృద్ధి సాధించాం. ప్రపంచం నివ్వెరపోయేలా తెలంగాణ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.
తలసరి విద్యుత్ వినియోగంలో ఇతర రాష్ట్రాలను అధిగమించి నెంబర్ వన్ గా నిలిచాం. ఇది మరో ప్రగతికి గీటురాయి. కలెక్టర్ కార్యాలయాల మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్ లు కూడా లేవని ఆయా రాష్ట్రాల ప్రతినిధులే చెబుతున్నారు. ఇంత అభివృద్ధి జరిగిందంటే జిల్లాలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారితో పాటు అధికారులు భుజం భుజం కలిపి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకే కీర్తి దక్కుతుంది. ఉద్యోగస్తులను అమెరికా నుంచి తేలేదు. పాత ఉద్యోగస్తులే. అదే అధికారులు, అదే ఐఏఎస్ లు ఉన్నారు. జట్టుకట్టి పట్టుబడి పనిచేస్తే ప్రగతి ఎలా ఉంటుందో రుజువు చేస్తున్నాం దీనికి తెలంగాణ ఒక ప్రబల నిదర్శనం అన్నారు.
బెస్ట్ ఫర్ ఎక్స్ లెన్స్ కోసం ప్రయాణం సాగిస్తాం..
పనిమంతులు, బుద్ధిమంతులు, ప్రగతి కాముకులు రిలాక్స్ అవ్వరు. బెస్ట్ ఫర్ ఎక్స్ లెన్స్ కోసం ప్రయాణం సాగిస్తాం. సాధించాక ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇంకా అద్భుతాలు సాధించాల్సి ఉంది. సాంఘిక, ఆర్థిక అసమానతలు, ప్రజల్లో ఉన్న అంతరాలు తగ్గిపోయి అందరూ గర్వంగా, గొప్పగా జీవించే పరిస్థితి రావాలి తెలంగాణలో ఆకలి లేదు, పస్తులుండే పరిస్థితులు లేవు. ఆత్మహత్యలు లేవు. ప్రజలు సంతోషంగా, సగర్వంగా బతుకుతున్నారు. పట్టుబట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకువచ్చినం. ఫ్లోరోసిస్ రహిత సమాజం కోసం దుశ్చర్ల సత్యనారాయణ తన బ్యాంకు ఉద్యోగం వదిలేసి స్వామి అనే యువకుడిని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు.
జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చింది
మహానుభావులు ఎందరో పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్రం రావడం, జీరో ఫ్లోరోసిస్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ ఘనత భగీరథ పథకం ఇంజనీర్ల కు దక్కుతుంది. మిషన్ భగీరథ వల్లే ఇది సాధ్యమైంది. జిల్లాకో మెడికల్ కళాశాల కూడా ఇండియాలో ఎక్కడా లేవు, పిల్లల కేరింతలు చూస్తే మనసు పులకరించింది. అనంతరం సూర్యాపేట ప్రగతి నివేదన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిందనీ, దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి, సూర్యాపేట జిల్లాకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధరణిని ఎత్తేసి దళారీల రాజ్యాన్ని మళ్ళీ తెస్తామంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎలక్షన్లు వస్తే ప్రజలు ఆగమాగం కావద్దని, ప్రజలు ఎవరి ఊర్లకు వారు పోయాక గత, వర్తమాన పరిస్థితులను విశ్లేషించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం ప్రజలను కోరారు.
నేడు పాడిపంటలతో తెలంగాణలో లక్ష్మి ఓలలాడుతోంది
ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో నేడు పాడిపంటలతో తెలంగాణలో లక్ష్మి ఓలలాడుతున్నదని అన్నారు. మరోసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదనీ, ఎవరెన్ని కథలు చెప్పినా, పోయినసారి కంటే మరో ఐదారు ఎక్కువ సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేటలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.