mt_logo

‘ఆవేశం స్టార్’ పొన్నం తీరు బాగాలేదు.. కరీంనగర్‌లో గెలిచేది బీఆర్ఎస్సే: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని.. వెంటనే ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు.

శనివారం కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్‌కు ఉందని.. వెంటనే దానం నాగేందర్ పై వేటు వేయాలన్నారు. దానం నాగేందర్ విషయంపై ఇటీవల స్పీకర్‌ను కూడా కలిశామని ఆయన అన్నారు.

ఇటీవలే కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో లీక్ అయిందని దానిలో హుజురాబాద్ నియోజకవర్గం తరపున ప్రజలు తనను ఎన్నుకున్నప్పటికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచకుండా చేయడానికి హుజురాబాద్ ఆర్డీఓ, ఎమ్మార్వోలకు ఫోన్ చేసి బెదిరించడం సిగ్గుచేటు అన్నారు. మంత్రి వ్యవహార శైలి బాగాలేదని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఆర్డీఓ మీద సీఎస్‌కు ఫిర్యాదు చేశానని మంత్రి చెబుతున్నారని, అసలు ఆర్డీఓను బదిలీ చేయడం కంటే మంత్రినే ఎందుకు బర్తరఫ్ చేయకూడదని ఆయన ప్రశ్నించారు.

కరీంనగర్ గడ్డమీద నుంచి మంత్రి పొన్నంకు సవాల్ విసురుతున్నానని అసలు ఆర్డీఓకు నాకు ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదని, ప్రభుత్వం మీదే కదా తనకు ఆడియోకు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందో లేదో తేల్చాలన్నారు. ఆడియో లీక్ చేసింది ఆర్డీఓ కాదని మంత్రి ఆఫీస్ నుంచే ఆడియో లీక్ అయిందని అన్నారు.

మంత్రి ఆఫీస్ నుంచి లీకైన సంభాషణకు అమాయకులైన ఆర్డీఓ ఎమ్మార్వోల పైన కక్ష సాధింపు చర్యలు ఎందుకని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి విషయంలో ఆవేశానికి లోనవుతున్నారని ప్రజలతో మాట్లాడే తీరు కూడా బాగాలేదని అందుకే ఇకనుంచి ఆయనకు ఆవేశం స్టార్ అని బిరుదు కేటాయిస్తున్నారని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఇలాంటివి చేస్తేనే తను ఉన్న ఏరియాలో కూడా 20 ఓట్లకు మించలేదని అన్నారు. ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారని దానిని మంత్రి సద్వినియోగం చేసుకోవాలి తప్ప బూతు పురాణంతో ప్రజలు విసిగించుకునే పనులు మానుకోవాలన్నారు. మంత్రి మాటలు విని అధికారులు పనిచేస్తే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే అవుతుందని అన్నారు.

అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయవద్దని అన్నారు. అధికారులు వారి పనివారు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున వారికి పూర్తి సహకారం ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులచే కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేపించారని అయినప్పటికీ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది కనుక ఏమి అనలేదని అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా తులం బంగారం కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసులకు ఇవ్వాల్సిన పీఆర్సితోపాటు అలవెన్స్లు ఇప్పించేలా కృషి చేయాలి తప్పా మంత్రి పదవి ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఒరిగేదేమీ లేదని అన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కరీంనగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ జండా మొదటగా ఎగరబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్ష మెజారిటీతో కూడా గెలవబోతున్నామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా కేసీఆర్‌ను ఎందుకు ఓడించామని బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ పాలల్లో పది సంవత్సరాలు తెలంగాణలో ఒక ఎకరమైన ఎండిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులతోపాటు యువకులంతా బిఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చి తాము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.