వినూత్నమైన పద్ధతిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీ తెలుగులో విజయవంతమైన ‘బలగం’ సినిమా థీమ్‌తో నిర్మించిన యాడ్స్‌ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన విజయాలను, పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను, అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగించడం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవలసిన అవసరాన్ని ఈ లఘు చిత్రాల్లో సృజనాత్మకంగా పొందుపరిచారు.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘బలగం’ సినిమా తెలంగాణలో సంచలనం సృష్టించింది. పచ్చని ప్రకృతి దృశ్యాలతో నిండిన సుందరమైన లొకేషన్‌లను చూపిస్తూ తెలంగాణ గ్రామీణ జీవితాలను ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని అపూర్వ విజయం సాధించింది. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రొజెక్టర్లు, స్క్రీన్‌ల మీద ఈ చిత్రాన్ని ప్రదర్శించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన లభించింది. బలగం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఐదు యాడ్‌లు సినిమా థియేటర్లలో మరియు టీవీల్లో ప్రదర్శించబడతాయి. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన వెంటనే ఈ యాడ్‌లు వైరల్‌గా మారాయి.