– హరితహారం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పెరిగిన జీవవైవిధ్యం
– అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
నాడు మోడు వారిన నేల.. నేడు నీళ్లతో నిండు గర్భిణిలా ఆనందంగా పరవశిస్తున్నది. బీడు భూముల్లో పసిడికాంతులు వెల్లివిరిస్తున్నాయి. వెలవెలబోయిన నీటి వనరులు సీఎం కేసీఆర్ సంకల్పంతో మండుటెండల్లోనూ గలగలా పారుతున్నాయి. హరితహారం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు విపరీతంగా పెరిగిపోయాయి. నాడు చుక్కనీరులేని బావులు.. నేడు చెంబుతో ముంచుకొనేలా నిండిపోయాయి. ఫలితంగా తెలంగాణ గడ్డపై తీరొక్క జీవం నేడు ఆనందంతో చెంగుచెంగుమంటున్నాయి. జీవవైవిధ్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
భూమిపై ఉన్న మానవాళికే కాదు.. సమస్త ప్రాణకోటికి నీరే జీవనాధారం. నీటి వనరులు నిండుగా ఉంటేనే ఆ గడ్డపై జీవవైవిధ్యం వెల్లివిరిస్తుంది. గత తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవవైవిధ్యం పరిఢవిల్లుతున్నది. నీటివనరులన్నీ నిండుకుండలా మారడంతో తీరొక్క జీవులు తెలంగాణకు తరలివస్తున్నాయి. పచ్చబడ్డ తెలంగాణ గడ్డపై ఆనందంతో పరవశిస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరుగడంతో మత్స్యసంపదతోపాటు ఇతర జంతుజాలం అభివృద్ధి చెందింది.
ఎన్నో ఏండ్ల తర్వాత పోచారం అభయారణ్యంలో జింకలు చెంగుచెంగున దుంకుతున్నాయి. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టకు తరలివస్తున్నాయి. భూపాలపల్లి ప్రాంతంలో దాదాపు 17 ఏండ్ల తర్వాత పెద్దపిల్లులు సందడి చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అన్ని జిల్లాల్లో పర్యావరణ సమతుల్యత నెలకొనడంతో విదేశీ పక్షులు తెలంగాణకు క్యూకడుతున్నాయి. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి హెరిటేజ్ సైట్‌గా గుర్తింపుపొందిన మెదక్ జిల్లాలోని అమీన్‌పూర్‌లో రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. మన గడ్డపై విదేశీ విహంగాలు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పాలపిట్టలు, ఊరపిచ్చుకల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతరించిపోయే దశలో ఉన్న చిరుత, పెద్దపులి, అడవికుక్క, మూషిక జింక, ఊరపిచ్చుక తదితర వైవిధ్య పక్షులు, జీవజాతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.
తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లెప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల పెంపు, అర్బన్ ఎకో పార్కులు జీవవైవిధ్యానికి ఆలవాలంగా నిలుస్తున్నాయి. భూసారాన్ని పెంచేందుకు అవసరమైన నత్రజని లభ్యత భారీగా పెరిగిపోయింది. దట్టంగా పెరిగిన మొక్కలు భూమి కోతను నిరోధించడంతోపాటు వర్షపు నీటి ప్రవాహాలను అడ్డుకొని భూమిలో ఇంకిపోయేలా చేయడంతో భూగర్భ జలాలు పెరిగిపోయాయి. ఫలితంగానే కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ జీవవైవిధ్యంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది.