mt_logo

అంగన్‌వాడీల్లోనూ వెరీ గుడ్డు.. పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

  • ఆరోగ్య‌ల‌క్ష్మి ప‌థ‌కం ప‌క్కాగా అమ‌లుకు
  • తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
  • కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

హైదరాబాద్‌: ఆరోగ్య లక్ష్మి పథకం.. తెలంగాణ రాష్ట్రంలోని బాలింత‌లు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం. 1975 నుంచి కేంద్రం ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా నడుపుతున్న  సమీకృత బాలల అభివృద్ధి పథకానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్రం ఈ పథకాన్ని అమ‌లు చేస్తున్న‌ది. ఐసీడ్ఎస్ పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా ల‌బ్ధిదారులంద‌రికీ పౌష్టికాహారం (గర్భిణులు, బాలింతలకు రేషన్ గా) అంద‌జేస్తుండ‌గా, ఈ పథకంలో దారిద్య్రరేఖకు దిగువలో ఉన్న కుటుంబాల బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారం భోజనం, రేషన్ రూపంలో అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా అంగ‌న్‌వాడీ కేంద్రాల నుంచి గర్బిణుల‌కు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు, పాల‌తోపాటు మంచి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తున్న‌ది. అయితే, అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా ప‌రిమాణంలో అతి చిన్న‌గా, నిలువ ఉన్న గుడ్ల‌ను పంపిణీ చేస్తున్నార‌నే ఫిర్యాదులు వ‌చ్చాయి. కాంట్రాక్ట్ తీసుకొన్న ఏజెన్సీలు గుడ్ల స‌ర‌ఫ‌రాలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని కంప్లైంట్స్ అందాయి. దీంతో తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకొన్న‌ది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న గుడ్ల నాణ్యత, సైజుల విషయంలో అపోహలు తొలగించటమే కాకుండా లబ్ధిదారులకు తాజా గుడ్లను పంపిణీ చేయాలని సంకల్పించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే ఏజెన్సీల ఇష్ట్యారాజ్యానికి అడ్డుకట్ట వేయటంతోపాటు గుడ్లు వక్రమార్గం పట్టకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే గుడ్డుపై మూడు రంగుల్లో ముద్రలను వేసి సరఫరా చేయాలని సంబంధిత ఏజెన్సీలకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆదేశాలు జారీ చేసింది.
నెలలో మూడు దఫాలుగా పంపిణీ చేసే గుడ్లపై మూడు రంగులు ముద్రించి సరఫరా చేయాలని ఆదేశించింది. తొలి 10 రోజుల్లో పికాక్‌ బ్లూ, రెండో 10 రోజుల్లో రెడ్‌, మూడో 10 రో జుల్లో గ్రీన్‌ ముద్రలు గుడ్డుపై ఉండాలని, గుడ్డు బరువు, ఎత్తు, పొడవులకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను పేర్కొన్నది. అంగన్‌వాడీ కేంద్రాలను ఏడు జోన్లుగా విభజించి, ఏజెన్సీలను కేటాయించింది. గుడ్ల సరఫరా, పంపిణీకి ఏజెన్సీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొన్నది. ఈ క్రమంలో అంగన్‌వాడీ టీచర్‌/సహాయకురా లు నుంచి సూపర్‌వైజర్‌, సీడీపీవో, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా కలెక్టర్లు పోషించాల్సిన పాత్రపై విధివిధానాల్లో స్పష్టత ఇచ్చింది.
కొత్త మార్గదర్శకాలు ఇవే..
గుడ్డు బరువు: ఆగ్‌మార్క్‌ నిబంధనలకు అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలి. అంతకన్నా తక్కు వ బరువున్న గుడ్డును సరఫరా చేసే ఏజెన్సీ టెండర్‌ను పునఃపరిశీలించి అవసరమైతే తొలగించవచ్చు. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాములుండాలి.
గుడ్డు పగలకుండా తెలుపులో ఉండాలి.
గుడ్డు 16 మిల్లీమీటర్ల డయామీటర్‌, 3 మిల్లీమీటర్ల ఎత్తు ఉండాలి.
గుడ్లను సరఫరా చేసే సంస్థ గోదాముల్లో గుడ్డు నాణ్యతను తెలిపే ల్యాబ్‌ ఉండాలి. ఎప్పటికప్పుడు పంపిణీ ప్రొటోకాల్‌కు అనుగుణమైన రిజిస్టర్‌ను నిర్వహించాలి.
అంగన్‌వాడీ టీచర్‌ విధి
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అం దించే పౌష్టికాహార పంపిణీ నిర్దేశిత నియమానుసారం ఉండేలా చూడాలి. గుడ్డు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా? లేదా అని చెక్‌ చేసుకోవాలి. గుడ్లను ర్యాండమ్‌గా ఆగ్‌మార్క్‌ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి. గుడ్ల బరువును పరిశీలించాలి. అంగన్‌వాడీ టీచర్‌ పరిశీలించిన తర్వాత వారి పరిశీలనను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిర్దేశిత నియమాలకు అనుగుణంగా సరఫరా చేసిన గుడ్లు లేవని తెలిస్తే తక్షణమే వాటిని తిప్పి పంపించాలి. అంగన్‌వాడీ టీచర్‌తోపాటు సహాయకురాలికి కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్ల నాణ్యత, సర్కార్‌ మార్గదర్శకాలపై సంపూ ర్ణ అవగాహన ఉండాలి.
అంచెలవారీ పర్యవేక్షణ
మొదట అంగన్‌వాడీ టీచర్‌ తర్వాత సూపర్‌వైజర్‌, సీడీపీవో, జిల్లా సంక్షేమ అధికారి ఇలా అంచెలవారీ పర్యవేక్షణ నిత్యం జరగాలి. జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పాడి పరిశ్రమ, పశు సంవర్ధకశాఖ అధికారి, జిల్లా వ్యవసా య, మార్కెటింగ్‌శాఖ అధికారి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, లీగల్‌ మెట్రాలజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వీరితో ఏర్పాటైన జిల్లా పర్యవేక్షణ కమిటీ గుడ్ల పంపిణీ విషయంలో ప్రతీ మూడు నెలలకోసారి పరిశీలించాలి. పంపిణీదారుల గోదాములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కలెక్టర్‌కు నివేదికను అందించాలి. ఈ నివేదిక ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేనిపక్షంలో కలెక్టర్‌ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌కు నివేదిక సమర్పించాలి.