- రెండు రోజుల్లో సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు
- సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభం
- సంచార జాతులకు కూడా ఆర్థిక సహాయం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ ఎంబీసీ కులాలు కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. వీరికి లక్ష రూపాయల చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అమలు విధి విధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్ కు వివరించారు. త్వరిత గతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం మంత్రి గంగులను ఆదేశించారు.