mt_logo

న‌గ‌ర‌వాసుల‌కు కిల‌కిల‌రావాలు.. కొంగొత్త‌గా కొత్వాల్‌గూడ ఎకో పార్కు

  • రూ.3.23 కోట్లతో పనులు
  • నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ టెండ‌ర్లు
న‌గ‌ర‌వాసులు ఎప్పుడూ కాంక్రీట్ జంగ‌ల్‌లో యాంత్రిక జీవ‌నం సాగిస్తారు. ఆహ్లాదం వారికెప్పుడూ అంద‌నంత దూరంలో ఉంటుంది. అలాంటి వారి చెంత‌కే ప్ర‌కృతిని తీసుకొచ్చి ప‌క్షుల కిల‌కిల‌రావాల‌తో వారిలో ఆనందాన్ని నింపేందుకు తెలంగాణ స‌ర్కారు న‌డుంబిగించింది.  ఔట‌ర్‌రింగ్ రోడ్డు చుట్టూ ప‌క్షుల అభ‌యార‌ణ్యాన్ని నిర్మించేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది. హైద‌రాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఎకో హిల్‌ పార్కును హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది.
పక్షులు.. మనందరి ప్రియనేస్తాలు. వాటి కిలకిలారావాలు వింటే మనసు పులకించడం ఖాయం. అంతటి అందమైన అనుభూతిని నగరవాసులకు పంచేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సిద్ధమైంది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్‌ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 85 ఎకరాల్లో పక్షుల అభయారణ్యాన్ని నిర్మించతలపెట్టింది. ఇందుకోసం అవసరమైన ప్రాథమిక పనులను చేపట్టేందుకు రూ. 3.23 కోట్లతో టెండర్లు పిలిచింది. పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు.
అందాలకు నిలయంగా కొత్వాల్‌గూడ ఓఆర్‌ఆర్‌..
పర్యాటకంలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్న హైదరాబాద్‌లో ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ఎకో హిల్‌ పార్కును నిర్మిస్తున్నది. గచ్చిబౌలి-శంషాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డు మార్గంలో హిమాయత్‌సాగర్‌ జలాశయం పక్కన కొత్వాల్‌గూడలోని 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఈ పార్కును అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఇందులో పక్షుల అభయారణ్యం కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. నేటి తరానికి నచ్చేలా.. పూర్తి స్థాయిలో ఆహ్లాదం పంచేలా దీన్ని నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.