mt_logo

తెలంగాణ స‌ర్కారు చె(చి)త్త శుద్ధి..9 క్ల‌స్ట‌ర్ల‌లో చెత్త ప్రాసెసింగ్‌కు అడుగులు

న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో చెత్త అనేది ప్రధాన స‌మ‌స్య‌.. చెత్త నిర్వ‌హ‌ణ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకొన్న ప‌ని. స‌రైన నిర్వ‌హ‌ణ లేకుంటే ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో హాని క‌లుగుతుంది. ఆది నుంచీ చెత్త నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టిపెడుతున్న తెలంగాణ స‌ర్కారు తాజాగా మ‌రో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్‌శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్లుగా విభజించి బిడ్లను ఖరారు చేసింది. త్వరలోనే శుద్ధి ప్రక్రియ మొదలు కానున్నది. డంపింగ్‌ యార్డుల్లో చెత్త నిల్వ చేయడం ద్వారా పర్యావరణ సమస్యలు, స్థానికులకు అనారోగ్య సమస్యలు, యార్డుల తరలింపుపై ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారంగా ఎప్పటి చెత్తను అప్పుడే శుద్ధిచేసిన చెత్త నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. 

హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 141 పట్టణ స్థానిక సంస్థల నుంచి ప్రతిరోజూ 4,316 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో రోజూ 1,960 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నారు. మిగిలిన 2,356 టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉన్నది. ఇందుకోసం మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను తొమ్మిది క్లస్టర్లుగా విభజించారు. వీటిలో 2,974 రోజువారీ టన్నుల (టీపీడీ) చెత్తను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నది. చెత్తను శుద్ధి చేయడానికి బిడ్లను పిలవగా ఏడు సంస్థలు ఆసక్తిని కనబర్చాయి. వీటికి బిడ్లను ఖరారు చేశారు. పదేండ్లపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ చేయాల్సి ఉంటుంది. వీటికి లెటర్‌ ఆఫ్‌ ఆగ్రిమెంట్‌(ఎల్‌వోఏ) ను జారీ చేశారు. బడంగ్‌పేట్‌లో 40, దమ్మాయిగూడలో 70, జవహర్‌ నగర్‌లో 55, కొంపల్లిలో 31, నార్సింగిలో 35 టీపీడీల చొప్పున చెత్తను జవహర్‌ నగర్‌లో శుద్ధి చేస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌, కరీంనగర్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, మణికొండ, సూర్యాపేట పట్టణ స్థానిక సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త ఆ స్థానిక సంస్థలే ప్రాసెసింగ్‌ చేసుకుంటున్నాయి.