mt_logo

ఆకాశ హ‌ర్మ్యాల న‌గ‌రం.. మ‌న హైద‌రాబాద్‌కు దేశంలోనే రెండో స్థానం

  • ముంబై తర్వాత ఇక్క‌డే భారీ బిల్డింగులు
  • సీబీఆర్ఈ నివేదిక‌లో వెల్ల‌డి

హైద‌రాబాద్‌: చాలా ఏండ్ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో తిరుగుతుంటే.. నేను ఇండియాలో ఉన్నానా?  లేక న్యూయార్క్‌లో ఉన్నానా? అర్థం కాలేదు ఇవీ ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టుడు ర‌జినీకాంత్ చేసిన వ్యాఖ్య‌లు.. ఒక్క ర‌జినీకాంతే కాదు.. హీరోయిన్ ల‌య‌స‌హా చాలామంది ప్ర‌ముఖులు ఇదే ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తంచేశారు. విశ్వ‌న‌గ‌రంగా మారిపోయిన హైద‌రాబాద్‌ను చూసి సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. విశాలమైన రహదారులు.. ఆకాశాన్ని అంటే ఎత్తయిన భవనాలు.. ఇవన్నీ నిన్నటి వరకు హాంకాంగ్‌, న్యూయార్క్‌ వంటి నగరాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ చుక్కలను తాకేలా 60 అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి. సీఎం కేసీఆర్ విజ‌న్‌.. మంత్రి కేటీఆర్ కార్య‌ద‌క్ష‌త‌తో ప్ర‌పంచ‌మే అబ్బుర‌పోయేలా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అభివృద్ధి చెందుతున్న‌ది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ సంస్థ కోల్డ్‌వెల్‌ బ్యాంకర్‌ రిచర్డ్‌ ఎల్లిస్‌ (సీబీఆర్‌ఈ) ఏషియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెల్లడించిన సర్వేలో.. ఎత్తయిన భవనాల్లో హైదరాబాద్‌ నగరం దేశంలోనే రెండో స్థానంలో నిలువ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

 స్కై ఈజ్‌ లిమిట్‌.. రైజ్‌ ఆఫ్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఇన్‌ ఇండియా..

ఎత్తయిన భవనాల్లో హైదరాబాద్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని ‘స్కై ఈజ్‌ లిమిట్‌.. రైజ్‌ ఆఫ్‌ టాలెస్ట్‌ బిల్డింగ్స్‌ ఇన్‌ ఇండియా’ పేరిట సీబీఆర్ఈ విడుదల చేసిన నివేదికలో 77 శాతం ఎత్తైన భవనాలు ముంబైలో ఉండగా, 8 శాతం హైదరాబాద్‌లో ఉన్నట్టు తేలింది. కోల్‌కతా, 7 శాతం, నోయిడా 5 శాతం ఉండగా, గుర్గావ్‌, బెంగళూరు, చెన్నైలో ఒక శాతం చొప్పున ఎత్తయిన బిల్డింగులు ఉన్నాయి. ముంబైకి మూడు వైపులా నీళ్లు (సముద్రం) ఉండటంతో ఇక్కడ భౌగోళికంగా విస్తరణకు అవకాశం లేనందున ఎత్తైన భవనాలు నిర్మించడం అనివార్యంగా మారింది. కానీ హైదరాబాద్‌కు ఉన్న అనేక భౌగోళిక అనుకూలతల్లో విస్తరణకు పుష్కలమైన అవకాశం ఉన్నది. అందుకే గత తొమ్మిదేండ్లలోనే హైదరాబాద్‌.. 10-20 కిలోమీటర్ల మేర పెరిగింది. పైగా లక్షల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ కూడా ఉన్నది. అయినా, ఎత్తైన భవనాలు గణనీయంగా పెరిగాయంటే అంతర్జాతీయంగా నగరం ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో ఇప్పటివరకు 58 అంతస్థుల (236 మీటర్లు) అతి ఎత్తయిన భవనం నిర్మితమవుతోంది. గతంలో పది అంతస్థులే గొప్ప అనుకుంటే, ఇప్పుడు 25-58 అంతస్థుల భవనాలు 63 ఉండగా, మరో 60కి పైగా బిల్డింగులు నిర్మాణ దశలో ఉన్నాయి.