mt_logo

తెలంగాణ స‌ర్కారు స‌హ‌కారం.. పూల‌సాగుతో ఎక‌రాకు 4 ల‌క్ష‌ల ఆదాయం

అన్న‌దాత సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ స‌ర్కారు అన్ని ర‌కాల పంటలు పండించేలా వారిని ప్రోత్స‌హిస్తున్న‌ది. వాణిజ్య‌, ఉద్యాన పంట‌ల‌తో అన్న‌దాత లాభాల పంట పండేలా చూస్తున్న‌ది. ఇందుకు అవ‌స‌ర‌మైన అధునాత‌న సౌక‌ర్యాల‌ను అంద‌జేస్తూ వెన్నుద‌న్నుగా నిలుస్తున్న‌ది. దీని ఫ‌లితంగానే పాలిహౌజ్‌ సిరుల పంట కురుపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ తదితర గ్రామాలకు చెందిన రైతులు  ప్రభుత్వ సాయం తో  ఆర్థికంగా ఎదుగుతున్నారు. పూల సాగుతో మంచిగా లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ సాయంతో అర ఎకరంలో పాలిహౌజ్‌ ఏర్పాటు చేసుకున్నారు. వివాహాది శుభకార్యాలకు, బొకేల తయారీకి అవసరమైన పూల సాగును చేపట్టి మంచి రాబడిని సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలిహౌజ్‌తో పూలను సాగు చేస్తున్న రైతులు.. ఇతర రాష్ట్రాల‌కు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి.. ఓ గదిలో భద్రపరుస్తారు. అక్కడ పూల గుత్తిని తయారు చేసి, ప్రతి పువ్వుకు ప్టాస్టిక్‌ కవర్‌తో భద్రపరిచి, పదింటిని ఒక గుత్తిగా తయారు చేసి పేపర్‌ అట్టలో భద్రపరిచి రవాణా చేస్తారు. ఇక్కడ పండించిన పూలను హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ, రాజమండ్రి, విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.25 చొప్పున అర ఎకరానికి 12 వేల మొక్కలను నాటుతున్నారు. ఇవి మూడేండ్ల వరకు నెలకు ఒకసారి పంటనిస్తాయి.

మొక్క నాటే ముందు..

ఎకరాకు రూ.6 లక్షల నుంచి 8 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, పెండ్లి సీజన్‌లో రూ. 12 లక్షల వరకూ, అన్‌ సీజన్‌లో రూ.10 లక్షల వరకు వస్తుందని, ఇక ఖర్చులు తీసివేయగా, ఆదాయం దాదాపుగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మిగులుతుందని రైతులు చెప్పారు. ఇలా మూడేండ్ల వరకు నిరంతరం పూల దిగుబడితో పాటు ఆదాయం వస్తున్నది. మొక్క నాటే ముందు పెద్ద కట్టలా ఏర్పాటు చేసి కట్టపై మొక్కలను నాటిస్తారు. నీటి ఎద్దడి లేకుండా బోర్లు వేశారు. ఈ బోర్ల నీటిని డ్రిప్‌ సాయంతో మొక్కలకు నీరందించి పంటలను పండిస్తున్నారు. డ్రిప్పుతో నీరు నేరుగా మొక్క వేరుకు పారడంతో పాటు నీరు ఆదా అవుతుంది. ఏ మొక్క అయిన తెగులు బారిన పడితే తక్షణమే గుర్తించి తగిన మోతాదులో మందులు వాడుతుంటారు. వీటికి చీడపీడలు సోకడం కూడా తక్కువే. పెళ్లిళ్ల సమయంలో తాము పండించే పూలకు మంచి రేటు వ‌స్తున్న‌దని,  తెలంగాణ స‌ర్కారు స‌హ‌కారంతో మంచి ఆదాయం పొందుతున్నామ‌ని కొత్త‌గూడ రైతు అంజిరెడ్డి ఆనందం వ్య‌క్తంచేస్తున్నాడు.  పాలిహౌజ్‌లోనే సాగు చేయడంతో ఎండాకాలంలోనూ మంచి దిగుబడి వస్తున్న‌దని, తాను ల‌బ్ధిపొంద‌డంతోపాటు కరువు పరిస్థితుల్లో ప్రతి రోజు 5 మందికి పైగా కూలీలకు చేతినిండా ఉపాధి చూపుతున్నానని  మ‌రో రైతు లోకేశ్వ‌ర్‌రెడ్డి సగౌరవంగా చెప్తున్నాడు. తెలంగాణ స‌ర్కారు, సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.