mt_logo

రాష్ట్రంలో మళ్లీ మనమే: సీఎం కేసీఆర్

  • ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది?
  • ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించండి 
  • రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం
  • కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నాం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం 

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రం లో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకొందామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘వజ్రతునక తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకొని అద్భుతంగా ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది  ఉత్సవాలను నిర్వహించుకుందాం’ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిమీదా ఉన్నదని సీఎం తెలిపారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇలా అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గం, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు సహా పలువురు ముఖ్యనాయకులతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అనతికాలంలోనే తెలంగాణ దేశానికి ఎలా రోల్ మోడల్ అయిందో ఆయన తనదైన శైలిలో ఆవిష్కరించారు. 

రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మనం కచ్చితంగా 95 ఉంచి 105 స్థానాలు గెలబోతున్నాం. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు అందరూ పనిచేస్తే కచ్చితంగా ప్రతీ ఒక్కరికీ 50వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.  పదేండ్ల కాలంలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం కాబట్టే ఇవ్వాళ తెలంగాణ మాడల్ను దేశం కోరుకుంటుంది అని సీఎం తెలిపారు. సూరాపేటలో, కామారెడ్డిలో లేదా మరో తెలంగాణ ప్రాంతంలో సభలు పెట్టుకుంటే వేలాది మంది మనప్రజలు రావడం సహజం కానీ, మహారాష్ట్రలోనూ అదే తరహాలో ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారంటే దానికి బలమైన కారణం మనం ఆచరించి చూపిన మోడల్. దీన్ని మనం బాగా చెప్పుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.