అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. దీనిని కౌన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించాయి. రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో తనకు ఉన్న లోతైన అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడిన విషయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ సర్కార్ ప్రగతిశీల పథంలో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తమ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇన్నోవేషన్ వ్యవస్థను ఉత్తేజ పరిచే విధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 14 రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ రంగాలకు విస్తృత రీతిలో అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.