mt_logo

సీఎం కేసీఆర్ ను అభినందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు..

హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభినందనీయుడని, రెండురోజులుగా స్వయంగా సీఎం కేసీఆర్ అధికారులతో కలిసి బస్తీల్లో తిరుగుతూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం పట్ల హైదరాబాద్ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, స్వయంగా సీఎం బస్తీలను దత్తత తీసుకోవడంతో అధికారుల్లో చలనం వచ్చి ప్రతి సమస్యను తీర్చేందుకు అంకితభావంతో పనిచేస్తారని అన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్, పోలీస్ అధికారులు కూడా స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొనడం నగరాభివృద్ధికి మేలు కలిగిస్తుందని, తెలంగాణ సర్కార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ప్రజారంజక పాలన అందించే నేతలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, అది వారి భవిష్యత్ కు పునాదిరాయి వంటిదని, తెలంగాణ మొదటినుండి ఎంతో అందమైన నగరాలు కలిగిఉన్న రాష్ట్రమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రైతు భరోసా యాత్ర పేరిట తెలంగాణలో పర్యటించిన రాహుల్ చౌకబారు వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ, ఏపీల్లో అకాల వర్షాలు, ప్రకృతివైపరీత్యాలు వచ్చి రైతులు ఆర్ధికంగా నష్టపోయారని, తెలంగాణ ప్రభుత్వం అకాలవర్షం వచ్చిన సందర్భంగా మంత్రులు, అధికారులతో నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని కూడా ప్రకటించిందని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *