mt_logo

నాకు శక్తినివ్వండి.. ఆరునెలల్లో బస్తీ రూపురేఖలు మారుస్తా..

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సికింద్రాబాద్ నియోజకవర్గం పార్శీగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో పర్యటించారు. ముందుగా అంబర్ నగర్ ను సందర్శించి అక్కడి కమ్యూనిటీ హాల్ లో స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం న్యూ అశోక్ నగర్ బస్తీకి వెళ్లి అక్కడి అర్బన్ వెల్ఫేర్, డెవెలప్ మెంట్ కమిటీ హాలులో బస్తీవాసులతో సమావేశం జరిపారు. వారి సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేవలం రెండు, మూడు బస్తీలే కాకుండా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను బాగు చేసేందుకు రెండు మూడు రోజుల్లో తార్నాకలో మరో సమావేశాన్ని నిర్వహిస్తానని, ఏదో ఉపన్యాసమిచ్చి రెండు, మూడు రోజులు తిరిగేందుకుతాను రాలేదని, వచ్చే నాలుగేళ్ళు ఇక్కడే ఉండి నిరుపేదల ఇండ్ల సమస్యలతో సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.

హైదరాబాద్ బస్తీల రూపురేఖలు మారాలంటే ప్రజలందరూ సహకరించాలి.. ఆరునెలల్లో ఎలా ఉండే బస్తీ ఎట్లా అయ్యిందో? అనుకునే విధంగా అందంగా తీర్చిదిద్దుతా.. మీరు నాకు శక్తినివ్వండి.. మీరు ఊహించనివిధంగా బస్తీలను అద్భుతంగా తీర్చిదిద్దుతానని సీ ఎం హామీ ఇచ్చారు. లండన్, అమెరికా బాగుంటాయని చెప్పుకుంటాం.. కానీ, అక్కడుండేది మనుషులే.. వాళ్ళు బంగారం తినరు.. మనకన్నా తెలివైనవారేం కాదు. వాళ్ళు ఆలోచించుకుని బాగుచేసుకుంటుంటే మనం ఆలోచించకుండా చెడిపోతున్నామన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పేదవాళ్ళు నివసించే హమాలీ బస్తీని కూడా అదేరోజు మంత్రి పద్మారావుతో కలిసి సీఎం కేసీఆర్ ఆకస్మికంగా సందర్శించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో సీఎం హమాలీ బస్తీ వద్ద ఆగి నేరుగా ఇళ్ళ మధ్యకు వెళ్ళారు. మురికివాడలో ఇరుకైన ఇళ్ళలో ఎంతో నిర్బేధ్యంగా బతుకులు వెళ్ళదీస్తున్న బస్తీవాసుల పరిస్థితిని చూసి వెంటనే స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? అనే వివరాలను ముషీరాబాద్ తహశీల్దార్ సుజాతను అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసులతో మాట్లాడుతూ, ఐడీహెచ్ కాలనీలో లాగా కేవలం ఆరు నెలల్లో రెండు పడక గదులతో కూడిన ఇళ్ళను నిర్మించి ఇస్తామని, సోమవారం మళ్ళీ తాను బస్తీని సందర్శిస్తానని, అర్హులైన వారిని గుర్తించి ఇళ్ళను మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *