మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్న భారత రాష్ట్ర సమితికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ ముస్లిం ఫోరం తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ పూర్తి మద్దతును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల స్థితిగతుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని ఇందుకు ప్రధాన కారణం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మైనార్టీ సంక్షేమానికి అందిస్తున్న భారీ బడ్జెట్‌తో పాటు అవలంబిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన కారణమని తెలిపారు.
ముఖ్యంగా మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన గురుకులాల వలన అద్భుతమైన భవిష్యత్తు కలిగిన మైనార్టీ పౌరులు తయారవుతున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతోపాటు పేద కుటుంబాలకు అండగా నిలిచేలా షాదీ ముబారక్ అందించడం ద్వారా కూడా మైనార్టీ ముస్లిం యువతులకు ఉపాధి, విద్యా అవకాశాల్లో స్థానం దక్కుతుందని తెలిపారు. దీంతోపాటు మైనార్టీ సంక్షేమానికి సంబంధించి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు, మైనార్టీలకు సంబంధించిన ప్రధానమైన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించి ఒక మెమొరాండంని అందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలన్న ఒక ఉదాత్తమైన లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె .తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరువు లేదు, కర్ఫ్యూ లేదు అని తెలంగాణ మొత్తం గంగా జమున తెహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతుందని తెలిపారు. గత పది సంవత్సరాల్లో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్దే మతంగా తెలంగాణ ముందుకు పోతున్నదని కేటీఆర్ అన్నారు. భారత రాష్ట్ర సమితికి సంపూర్ణ మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.