mt_logo

కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. హుజూర్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ రాగానే కొన్ని పార్టీలు గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తాయని, ప్రజలు ఆగమాగం కావొద్దని చెప్పారు. ఎన్నికలు రాగానే ప్రజలు గాలి గాలి.. గత్తర గత్తర కావొద్దని బీఆర్ఎస్ అధినేత, సీఎం సూచించారు. యువ‌త ఆలోచించాలి. ఈ దేశం, రాష్ట్రం మీది.. రేప‌టి బ‌తుకుదెరువు మీది. ఓటు అనేది అల‌వోక‌గా వేసేది కాదని అన్నారు. అది మ‌న భ‌విష్య‌త్‌ను మారుస్తుంది. ఓటును దుర్వినియోగం చేయొద్దు అని కేసీఆర్ కోరారు. ప్రజలకు రాజ్యాంగం అందించిన విలువైన ఆయుధం ఓటు హక్కు అని.. ప్రజల తలరాతను నిర్ణయించేది ఓటేనని ఆయన తెలిపారు.

ప్ర‌జ‌లు గెలిచే ఎన్నిక‌నే నిజ‌మైన ప్ర‌జాస్వామిక ఎన్నిక‌

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను కట్టాల్సిన చోట కట్టలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏనాడు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు నిలదీయలేదని.. వాళ్లకు పదవులు వస్తే చాలనుకుని ఊరుకున్నారని చెప్పారు. 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలపాలని నిర్ణయిస్తే.. ప్రజలు, విద్యార్థులు తిరుగుబాటు చేస్తే.. హైదరాబాద్ సిటీ కాలేజీ వద్ద ఏడుగురిని కాల్చి చంపారని ఆయన ఆగ్రహించారు. మీ అంద‌రూ గ‌తంలో చాలా ఎన్నిక‌లు చూశారు.. చాలా సార్లు ఓట్లు కూడా వేశార‌ని కేసీఆర్ తెలిపారు. నేను ప్ర‌తి స‌భ‌లో చెప్తున్నా.. ప్ర‌జ‌స్వామ్య ప‌రిణితి సంత‌రించుకోవాల్సిన ల‌క్ష‌ణం ఏంటంటే.. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆలోచించి మంచి చెడుల‌ను విచారించి ఓటు వేస్తే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలుస్త‌రు. లేదంటే నాయ‌కులు గెలుస్త‌రు. ప్ర‌జ‌లు గెలిచే ఎన్నిక‌నే నిజ‌మైన ప్ర‌జాస్వామిక ఎన్నిక‌. అప్పుడే ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి జ‌రుగుతుంది. మీ అంద‌ర్నీ ప్రార్థించేది ఒక్క‌టే.. ఏది నిజ‌మో తేల్చిన త‌ర్వాత ఓటు వేయాల‌ని కోరుతున్నారు.

ఎన్నిక‌లు రాగానే ఆగం కావొద్దు

పార్టీకి ఒక‌రు నిల‌బడుతారు. కానీ వ్య‌క్తుల వెనుక పెద్ద పార్టీ ఉంట‌ది. ఆయా పార్టీల చ‌రిత్ర ఏంది..? వైఖ‌రి ఏంది..? దృక్ప‌థం ఏంది..? ఎవ‌రు ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నార‌నే అంశంపై చర్చ జ‌ర‌పాలని కేసీఆర్ సూచించారు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకుంటే ఈజీగా అర్థ‌మ‌వుత‌ద‌ని కేసీఆర్ తెలిపారు.  ద‌ళిత బిడ్డ‌లు అనాదిగా, యుగ‌యుగాలుగా వివ‌క్ష‌కు, వెనుక‌బాటు త‌నానికి గురువ‌తున్నారని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎందుకు ఈ దుస్థితి. అణిచివేత‌కు గుర‌వుతున్నారు. ఎందుకు ఉండాలి ఈఖ‌ర్మ‌,  మ‌న లాగా వారు పుట్ట‌లేదా..? వారు సాటి మాన‌వులు కాదా..? స్వాతంత్య్రం  వ‌చ్చిన కొత్త‌లో కాంగ్రెస్ ఈ ఆలోచ‌న చేసి ఉంటే ద‌ళిత స‌మాజం ఇన్ని బాధ‌లు ప‌డేది కాదు. ఎన్నిక‌లు రాగానే ఆగం కావొద్దు.. ఇంకా ఎన్ని యుగాలు ఉండాలి ద‌ళితులు ఇలా. ఇవ‌న్నీ ఆలోచించి ద‌ళిత‌బంధు తీసుకొచ్చాం. గిరిజ‌న బిడ్డ‌లు మా తండాలో మా రాజ్యం కావాల‌ని ఏండ్ల పాటు కొట్లాడారు. కానీ ఎవ‌రూ చేయ‌లేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా మార్చింది.  ఎన్నిక‌లు రాగానే గోల్ మాల్ చేయాలి. మందుసీసాలు స‌ర‌ఫ‌రా చేయాలనేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప‌ని. అది ప్ర‌జాస్వామ్యం కాద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో మొగోళ్లు లేరా?

కరెంట్, నీళ్ల కోసం కాంగ్రెస్ ఏనాడు పోరాడలేదని.. కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే పేగులు తెగేదాకా కొట్లాడారని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2003 లో రైతులకు నాగార్జున సాగర్ నీళ్లు ఇవ్వాల్సినన్ని ఇవ్వలేదని, ఆనాడు సాగర్ కట్టపైకి ఎక్కి, నీళ్లిస్తారా? తూములు పగులగొట్టమంటారా? అని తాను వార్నింగ్ ఇచ్చానన్నారు. తన హెచ్చరికలకు ప్రభుత్వం దిగి వచ్చి.. నీళ్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని..  అయినా ఒకరేమో ముఖ్యమంత్రి అవుతానని, మరొకరేమో బుడ్డర్‌ఖాన్‌ను అవుతానంటూ ఎగురుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో అంటే.. కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడలేదని, కాంగ్రెస్‌లో మొగోళ్లు లేరా? అని సీఎం అన్నారు.