- త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో అంగన్‌వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
- మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేసిన ప్రభుత్వం
అంగన్ వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయు ఐఐటీయు యూనియన్లు ఆదివారం ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు.
అంగన్ వాడీల సమ్మె పై ఏఐటీయూసీ సీఐటీయు నాయకులతో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చర్చలు జరిపారు. వారి డిమాండ్లను విని మంత్రులు సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీ లో అంగన్వాడీలను చేర్చుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీరి జీతాలను కూడా పెంచుతామని అన్నారు.
ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై తొందర్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై నివేదికను సమర్పించవలసిందిగా మహిళా శిశు సంక్షేమ సెక్రెటరీని భారతి హోలికేరినీ ఆదేశించారు. అంగన్ వాడీ సెంటర్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయబడుతుందని కూడా మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది అంగన్వాడీ ఉద్యోగులకు లాభం చేకురుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంగన్‌వాడీల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
గతంలో ఏ ప్రభుత్వాలు అంగన్‌వాడీల గురించి పట్టించుకోలేదని అంగన్‌వాడీ వర్కర్లుగా ఉన్న వారి పేరును అంగన్వాడి టీచర్లుగా గౌరవప్రదంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారు అని యూనియన్ నాయకులు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్‌వాడీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి వారి డిమాండ్లను అన్ని సానుకూలంగా స్పందించారని కొనియాడారు.ఈ సందర్భంగా సానుకూల నిర్ణయం వెలువడం పట్ల అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి సీఎం కేసీఆర్‌కి మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపాయి.