తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు.. సరళతర అనుమతులు విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సీఎం కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ పనితీరుకు మెచ్చి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఫాక్స్‌కాన్‌లాంటి మహా మహా కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను తెరిచేందుకు శంకుస్థాపనకూడా చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో ప్రసిద్ధ సంస్థ చేరింది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ తరలివచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలీపర్ఫామెన్స్’ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి.. పెట్టుబడులపై వివరించారు. 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే నెలలో క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. టెలీపర్ఫామెన్స్ సంస్థ 45 ఏండ్ల కిందట పారిస్ కేంద్రంగా 1978లో ప్రారంభమైంది. కంపెనీని డానియెల్ జులియెన్ స్థాపించారు. క్రమంగా సంస్థ విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేసింది. తాజాగా తెలంగాణలో క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.