- భవిష్యత్తులో ఫాక్స్‌కాన్, ఫార్మాసిటీల వరకూ రైల్వే లైన్ !
- మరిన్ని ప్రాంతాలకు విస్తరణపై సర్కార్ దృష్టి
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. అమెజాన్, గూగుల్, మైక్రాన్.. ఫాక్స్‌కాన్‌లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడికి క్యూకడుతున్నాయి. ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకొంటున్నాయి. దీంతో నగరు శివారు వరకూ వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ డెవలప్‌మెంట్ ఇంకా కొనసాగాలంటే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి. గంటల్లో నగరంలో ఎక్కడికైనా చేరుకొనే సౌకర్యం ఉండాలి. అప్పుడే హైదరాబాద్ మరింత ప్రగతి సాధిస్తుంది. ఇందుకోసం తెలంగాణ సర్కారు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నది. నగరం నుంచి శివారు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. దీంతో భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరింత మహర్దశ రానున్నది. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న కాలనీలు, ఏర్పాటవుతున్న పారిశ్రామిక వాడలతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. సుమారు 20కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నది. ఎయిర్‌పోర్టు వరకు వచ్చే మెట్రో మార్గాన్ని తుక్కుగూడ పారిశ్రామికవాడ వరకు పొడిగించాలని ఇటీవల మంత్రి సబితారెడ్డితోపాటు పలువురు సీఎం కేసీఆర్‌కు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతోపాటు జిల్లాలో ఏర్పాటవుతున్న ఫాక్స్‌కాన్, ఫార్మాసిటీల వరకూ మెట్రో రైలు సేవలు విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అదేవిధంగా ఎల్‌బీనగర్ వరకు అందుబాటులో ఉన్న మెట్రో రైల్వేను హయత్‌నగర్ వరకు పొడిగించాలని యోచిస్తున్నది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పక్కన ఉన్న తుక్కుగూడ పారిశ్రామిక వాడ వరకు మెట్రో సదుపాయం కల్పించాలని ఇటీవల రావిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు పలువురు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు తుక్కుగూడ వరకు మెట్రో సేవలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎల్‌బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్ వరకు మెట్రోరైలు పొడిగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దీంతో జిల్లాలోని శంషాబాద్, తుక్కుగూడ, హయత్‌నగర్‌లకు త్వరలోనే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
త్వరలో ఫాక్స్‌కాన్, ఫార్మా సిటీ వరకు!
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.6,000కోట్లతో మెట్రో రైలు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, తుక్కుగూడ వరకు కూడా దీనిని పొడిగించనుంది. తుక్కుగూడ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్‌తో పాటు ఫాక్స్‌కాన్ కంపెనీ వరకు మెట్రో సేవలు విస్తరించాలని యోచిస్తున్నది. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కంపెనీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫాక్స్‌కాన్ కంపెనీకి వచ్చేవారి కోసం కొంగరకలాన్ వరకు మెట్రోరైలు సేవలందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. తుక్కుగూడ నుంచి ఫాక్స్‌కాన్ వరకు మెట్రోలైన్ ఏర్పాటు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వరకు కూడా మెట్రోసేవలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎల్‌బీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, దీనికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్‌నగర్ వరకు పొడిగిస్తే శివారు ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.