తెలంగాణ ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ (టీఎస్ బీపాస్)ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. భూ యజమానులకు, ప్రాపర్టీ బిల్డర్లకు భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతున్నది. టీఎస్ బీపాస్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 15న తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టింది. ‘టీఎస్ ఐపాస్ లాగానే టీఎస్ బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ విధానాన్ని ఆమోదించింది. 2020 నవంబరు 16న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా 600 చదరపు గజాలలోపు ఉండే ఇండ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తుంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ ఉన్న నివాస, నివాసేతర భవనాలకు 21 రోజుల్లో సింగిల్ విండో అనుమతి అందజేస్తారు. కాగా, ఈ విధానంతో తెలంగాణలో భవన నిర్మాణ రంగం పరుగులు పెడుతున్నది. ఈ రంగంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలు పరుగులు పెడుతున్నాయి.
రంగారెడ్డి, మేడ్చల్‌లో శరవేగంగా భవన నిర్మాణాలు
టీఎస్ బీపాస్‌తో తెలంగాణలో ఇండ్ల యజమానులు భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పింది. హైదరాబాద్ జిల్లాలోని ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణాలు పూర్తైపోయాయి. దీంతో శివారు ప్రాంతాల్లో భవన నిర్మాణరంగం వేగం పుంజుకొన్నది. శివారుప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో భవనాలు నిర్మిస్తున్నారు. టీఎస్ బీపాస్‌తో సులభంగా, వేగంగా అనుమతులు లభిస్తుండడంతో అందరూ భవనాలను నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా పేద, మధ్యతరగతి, ఉన్నత.. ఇలా అన్ని వర్గాలవారు నిర్మించుకొనే అన్ని రకాల హౌజ్ కన్‌స్ట్రక్షన్‌లో రంగారెడ్డి టాప్‌లో ఉండగా.. ఆ తర్వతి స్థానంలో మేడ్చల్ నిలిచింది. ద్వితీయ శ్రేణి నగరమైన హనుమకొండ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నది.
తెలంగాణ సర్కారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు శరవేగంగా అభివృద్ధి చేస్తుండడం, ఐటీ హబ్, మెరుగైన మౌలిక వసతుల కల్పనతో భవన నిర్మాణ రంగంలో హనుమకొండలాంటి పట్టణాలు కూడా దూసుకుపోతున్నాయని టీఎస్ బీపాస్ లెక్కలో తేలింది.
టీఎస్ బీపాస్ విశేషాలు..
ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులు 2,17,303
ఆమెదించిన దరఖాస్తులు 1,57,091
తిరస్కరించిన దరఖాస్తులు 45,148