*ఆంధ్రప్రదేశ్‌నుంచి విడిపోతే తెలంగాణ చీకటవుతుంది. తెలంగాణవాళ్లకు పరిపాలన చేతకాదు..* ఇదీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పడు ఆంధ్ర నాయకుల మాటలు. ఇటీవల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ అంటే చూచిరాతలు.. కుంభకోణాలు అంటూ అక్కసు వెళ్లగక్కారు. కానీ.. అదే ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇప్పుడు చాలామంది పనికోసం తెలంగాణ బాటపడుతున్నారు. నాడు సమైక్య రాష్ట్రంలోనే వ్యవసాయం అంటే పేరున్న కృష్ణా జిల్లాలో పని దొరక్క తెలంగాణ పొలాల్లో పనిచేసేందుకు కూలీలు తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో పచ్చబడ్డ తెలంగాణ పక్క రాష్ట్రాల ప్రజలకు ఉపాధి తొవ్వ చూపుతున్నది. స్వరాష్ట్రంలో కేసీఆర్ మొదట వ్యవసాయ రంగానికే పెద్దపీట వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వరి సాగులో పంజాబ్‌ను దాటి తెలంగాణ దేశంలోనే టాప్‌గా నిలిచింది. దీంతో సమైక్య పాలనలో ఎండిన పంటలతో తల్లడిల్లి వలసబాట పట్టినవారంతా ఇప్పుడు స్వస్థలాలకు విచ్చేసి, వ్యవసాయం చేస్తున్నారు. వరితోపాటు పత్తి సాగు పెరగడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌నుంచి కూలీలు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
నల్లగొండకు పనుల కోసం కృష్ణా కూలీలు
ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని కృష్ణా జిల్లాలో వరినాట్లు నెల ఆలస్యం అవుతున్నాయి. దీంతో అక్కడి కూలీలు పనికోసం నల్లగొండ జిల్లాకు వలస వస్తున్నారు. ఈ జిల్లాలోని దేవరుప్పులలో 25మంది కూలీలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని మరీ పనిచేస్తున్నారు. వరినాట్ల పనుల్లో ఆంధ్రా కూలీలు మునిగి తేలుతున్నారు. ఆంధ్రలో అయితే ఎకరాకు 4,400 రూపాయలు మాత్రమే ఇస్తారని, అదే తెలంగాణలో ఎకరాకు 5,500 ఇస్తున్నారని కూలీలు చెప్తున్నారు. తెలంగాణ రైతులు తమను ప్రేమగా చూసుకొంటున్నారని, ఉండేందుకు చోటిచ్చి మంచి వసతి ఏర్పాటు చేశారని మురిసిపోతున్నారు. ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, పంటలు బాగా పండాయని, తమకు నెలపాటు చేతినిండా పని దొరుకుతున్నదని ఆంధ్రా కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.