- తెలంగాణ సాగునీటి రంగ విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలన్న సంస్థ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ పర్యటన
- ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాలు
- అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాల పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేటీఆర్
- తన పర్యటనలో పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం కానున్న కేటీఆర్
- కేటీఆర్ పర్యటనలో పలు కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం
- ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
- ఈనెల మూడవ వారం వరకు కొనసాగనున్న కేటీఆర్ పర్యటన
ప్రపంచ వేదిక పైన తెలంగాణ సాధించిన జలవిజయాన్ని చాటేందుకు మంత్రి కే తారక రామారావు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారి మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాలను అమెరికాలోని నెవడా రాష్ట్రం లోని హెండర్సన్ నగరంలో జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసేందుకు సంస్థ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారు.
సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి 2017 లో అమెరికా శాక్రమెంటో వేదికగా జరిగిన ASCE సదస్సులో మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భారీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలు, అందరికీ సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ లాంటి బృహత్ పథకాల గురించి ఆ రోజు కేటీఆర్ వివరించినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ASCE, ఆ తర్వాత 2022 లో తెలంగాణలో పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగం లో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ సొసైటీ సంస్థ, ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపించింది.
అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్ ఇంజనీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, దాని ద్వారా అందుతున్న ఫలాలు , ఇతర ప్రణాళికలను ఒక ప్రజెంటేషన్ రూపంలో అందించనున్నారు. కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నీళ్ళు అందించిన విధానం ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సామాజిక ఆర్థిక ప్రగతిని మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచానికి వివరించే అవకాశం దక్కడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ, ఇవాళ పచ్చని పంటలతో కళకళలాడడానికి గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారికి ఈ నేలపై ఉన్న మమకారం, అపార జ్ఞానం, ముందుచూపే కారణమని కేటీఆర్ చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. ఈ నెల చివరి వారం వరకు కొనసాగే ఈ పర్యటనలో పలు అమెరికన్ కంపెనీలు తమ పెట్టుబడి ప్రకటనలను చేసే అవకాశం ఉన్నది.