రాష్ట్రంలో పర్యటిస్తున్న నీతీఆయోగ్ మరియు కేంద్ర జల్‌శక్తి అభియాన్ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలు బాగున్నాయని అభినందించారు. శుక్రవారం నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అబ్దుల్ ఖలీల్, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్‌గుప్తా కరీంనగర్ జిల్లా గంగధార మండలం, ర్యాలపల్లి రామడుగు మండలం, వెలిచాలలో అధికార బృందాలు సందర్శించాయి. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల్‌శక్తి అభియాన్, హరితహారం పనులను పరిశీలించి, ప్రశంసించారు. వెలిచాలలో ఇంకుడుగుంతలు, జలసంరక్షణ వాల్ పెయింటింగ్స్, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీర్ల సరోజనను అధికారుల బృందం అభినందించింది. ఈ గ్రామం మరోసారి జాతీయ అవార్డు పొందేందుకు అర్హత కలిగి ఉన్నదని చెప్పారు. అలాగే కరీంనగర్ జిల్లాకేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్మించిన నీటి కుంటను పరిశీలించారు. పనులను చూసి సంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో విజయవంతం చేసిన కలెక్టర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ శర్మ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎల్ శ్రీలత, ఏపీడీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
