ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు గత కొన్ని నెలలుగా వివాదం చెలరేగుతోంది. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చేరిపేయాలన్న ప్రయత్నంలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వంపైనే దాడి చేస్తుంది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో.. ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లి రూపం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చరిత్రలోకి వెళ్తే.. తెలంగాణ తల్లి భావన తెలంగాణా ప్రాంత ప్రజల్లో చాలా కాలంగా ఉన్నది. సమైక్యవాదులు తెలుగు తల్లి పేరిట భాషా అస్తిత్వాన్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేసినప్పుడు, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తేవాలన్న ఆలోచన ఉద్యమసారథి కేసీఆర్‌ది.
తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేయగా, కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బీవీఆర్ చారి. ఈ రూపం దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై ప్రచురితమైంది.
తెలంగాణ తల్లికి తామిచ్చిన రూపాన్ని బీఎస్ రాములు, ఉద్యమ సారథి కేసీఆర్ ముందుపెట్టగా ఆయన కొన్ని మార్పులు సూచించాడు. ఈ విషయమై చర్చించడానికి రెండు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో అనేకమంది రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో విగ్రహ రూపం గురించి చర్చ జరుగుతూ.. తెలంగాణ తల్లి వెనుకబడ్డ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
తెలంగాణ ఎప్పటికి ఇలాగే వెనుకబడి ఉండదు కదా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది అనే నమ్మకంతో.. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో రూపొందించిన భారతమాత చిత్రాన్ని తలపించేలా.. తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని ఆ సమావేశంలో పాల్గొన్న పలువురు తెలంగాణవాదులు సూచించారు. తదనుగుణంగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు.
తెలంగాణలోని ప్రత్యేకతలను తెలంగాణ తల్లి రూపకల్పనలో జోడిస్తూ తీర్మానించడం జరిగింది. వాటిని సమన్వయిస్తూ బీఎస్ రాములు డిజైనింగ్ రూపాన్ని సూచించారు.
అలా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టు చీర, కరీంనగర్ వెండి మట్టెలు, మెట్ట పంటలకు చిహ్నంగా మక్కకంకులు, భరతమాత ముద్దు బిడ్డగా, రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో ప్రసిద్ద కోహినూర్ వజ్రం, వడ్డాణం, జరీ అంచుచీర, నిండైన కేశ సంపద తదితరాలతో తుది మెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు సంశ్లేషించబడ్డాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించుకుని గొప్ప స్ఫూర్తిని పొందారు తెలంగాణవాదులు.
దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతమాత విగ్రహం రూపు మారదు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుతల్లి విగ్రహం మార్చరు. మరి అలాంటప్పుడు తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాలనుకోవడం తప్పు.
కేవలం ఒకరి మొండి పట్టుదలతో, తెలంగాణ సమాజంలో ఎవరిని సంప్రదించకుండా రహస్యంగా తయారుచేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడం దుర్మార్గం. తెలంగాణ తల్లి మిగతా అందరు తల్లుల లాగానే సిరిసంపదల ప్రతీకగా ఉండాలే తప్ప పేదగా ఉండకూడదు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమే అవుతుంది. కనుక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ చర్యను విరమించుకోవాలి.
కొసమెరుపు ఏంటంటే.. విగ్రహ మార్పు గురించి చర్చ జరుగుతున్న సమయంలో.. నిన్ననే కొత్త విగ్రహం ఇలా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక విగ్రహ రూపం సర్క్యులేట్ అవ్వడం మొదలైంది. కొత్త విగ్రహం కళావిహీనంగా, చిన్న చిన్న నగలతో, చేతిలో బతుకమ్మ లేకుండా, కిరీటం లేకుండా ఉంది. పైగా చెయ్యిని చూపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల కోడ్ వస్తే ఈ కొత్త రూపంలో ఉన్న హస్తం గుర్తు వల్ల ఈ విగ్రహాలకు ముసుగు వేసే ప్రమాదం కూడా లేకపోలేదు.
తెలంగాణలో ఎవరిని సంప్రదించకుండా, ఎవరితో చర్చించకుండా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తయారు చేసిన ఈ కొత్త రూపం అసలు తెలంగాణ తల్లి కానే కాదు ఆ కొత్త రూపం కాంగ్రెస్ తల్లి అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది.