mt_logo

తెలంగాణ బ‌డులు నంబ‌ర్ వ‌న్‌.. కేంద్ర విద్యాశాఖ ఫ‌ర్మార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్‌లో స‌త్తా

-మూడు జిల్లాలకు ‘ఉత్తమ్‌’ గ్రేడ్‌..22 జిల్లాలకు గ్రేడ్‌ 1

స‌మైక్య పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో నిర‌క్ష్యానికి గురైన మ‌న స‌ర్కారు విద్య‌.. స్వ‌రాష్ట్రంలో మ‌న బిడ్డ‌లు స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకొనేలా చేస్తున్న‌ది. గురుకుల పాఠ‌శాల‌ల ఏర్పాటుతోపాటు స‌ర్కారు స్కూళ్ల‌లోనూ తెలంగాణ స‌ర్కారు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించింది. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్న‌ది. ఫ‌లితంగా మ‌న స‌ర్కారు బ‌డుల ప్ర‌తిభ కేంద్ర‌స్థాయిలో మెరుస్తున్న‌ది. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్‌ గ్రేడెడ్‌ ఇండెక్స్‌ (పీజీఐ) ర్యాంకులే ఇందుకు నిద‌ర్శ‌నం. పీజీఐలో మేడ్చల్‌ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్‌’ గ్రేడ్‌ను కైవసం చేసుకోగా..పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించిన ఈ సూచీలో తెలంగాణకు చెందిన మరో 22 జిల్లాలు ‘ప్రచేస్త-1’ గ్రేడ్‌ను సొంతం చేసుకొన్నాయి. ఆరు జిల్లాలు ‘ప్రచేస్త-2’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. అభ్యాస ఫలితాలు, నాణ్యత, పాఠశాలలు-టీచర్ల లభ్యత, మౌలిక సదుపాయాలు, తరగతి గదులను సమర్థంగా నిర్వహించడం, స్కూల్‌ సేఫ్టీ, పిల్లల రక్షణ, డిజిటల్‌ లెర్నింగ్‌, గవర్నెన్స్‌ లాంటి మొత్తం 83 అంశాలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు ఈ సూచీని రూపొందించారు.

పీజీఐ 2021-22 వివ‌రాలు..

-2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 51 జిల్లాలు ‘అతి ఉత్తమ్‌’ గ్రేడ్‌ను కైవసం చేసుకున్నాయి. ‘ఉత్తమ్‌’ గ్రేడ్‌ను 271 జిల్లాలు, ప్రచేస్త -1 గ్రేడ్‌ను 290 జిల్లాలు, ప్రచేస్త-2 గ్రేడ్‌ను 117 జిల్లాలు దక్కించుకోగా.. 18 జిల్లాలకు ప్రచేస్త్ర-3 గ్రేడ్‌, ఒక జిల్లాకు ‘ఆకాంక్షి-1’గ్రేడ్‌ లభించింది.

– తెలంగాణ నుంచి నల్లగొండ, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, వనపర్తి, కరీంనగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, ములుగు, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు ప్రచేస్త-1 గ్రేడ్‌ను ద‌క్కించుకొన్నాయి.

-నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాలు ప్రచేస్త-2 గ్రేడ్‌ను సొంతం చేసుకున్నాయి.