mt_logo

ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

శిల్పకళా వేదికలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 

హైదరాబాద్, మే 22: 2014 లో 2950 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 8340కి చేరింది. సీఎం కేసీఆర్ పట్టుదల వల్లే ఇది సాధ్యమైంది. మంత్రం వేస్తే కాదన్నారు. ఇటీవల ప్రధాని మోదీ వచ్చి నాలుగేళ్ల కిందట ప్రారంభమైన ఎయిమ్స్ కు మళ్ళీ శంఖుస్థాపన చేశారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలో మొదటి స్థానం, 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో తెలంగాణ ఉంది. త్వరలో పిజి సీట్లలోను మొదటి స్థానానికి వెళ్తాం. ఎంబీబీఎస్ సీట్ల పెరుగుదల దేశంలో 71శాతం ఉంటే, తెలంగాణ 124శాతం. పీజీ సీట్ల పెరుగుదల దేశంలో 68శాతం ఉంటే, తెలంగాణ 111 శాతం. గతేడాది వరకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు బి కేటగిరీ సీట్లకు అర్హులుగా ఉండేవారు. తాజా సవరణ మేరకు బి కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% సీట్లు తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయించాం. స్థానిక రిజర్వేషన్ వల్ల రాష్ట్రం లోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,071 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థుల‌కే లభించాయన్నారు. దీంతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6శాతం నుంచి 10శాతానికి పెంచుకోవడం వల్ల 209646 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించిందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల వల్ల వ్యయ ప్రయాసలకు ఓర్చి, తల్లిదండ్రులకు దూరంగా ఉక్రెయిన్, చైనా, యూరప్ వెళ్లి డాక్టర్ చదవాల్సిన పరిస్థితి తప్పింది,  ఒకవైపు డాక్టర్‌ కావాలనే విద్యార్థుల కోసం వైద్య విద్య, మరోవైపు ప్రజలకు జిల్లా స్థాయిలోనే నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 1100 కోట్లతో 2000 పడకలతో వరంగల్ హెల్త్ సిటీ, నగరం నలువైపులా 1000 పడకలతో టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ లో 2000 పడకలు, ఎం ఎన్ జే ఆసుపత్రి 300 నుంచి 750 పడకలు, 200 పడకలతో గాంధీ, నిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్. మొత్తంగా 10వేల సూపర్ స్పెషాలిటీ పడకలు కొత్తగా రాబోతున్నాయి,  

వరంగల్ హెల్త్ సిటీ నీ ఈ ఏడాది ప్రారంభిస్తాం..  

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కలిపితే 2014లో 17150 పడకలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 33,314 లకు పెంచుకున్నాం. కొత్త హాస్పిటల్లో అందుబాటులోకి వస్తె 50 వేల మార్క్ అందుకుంటాం. ఓపీ 2021లో 4.23 కోట్లు ఉండగా, గతేడాది 4.83 కోట్లు నమోదైంది. ఐపీ సేవలు 14.16 లక్షల నుంచి 16.97లక్షలకు పెరిగాయి. మేజర్‌, మైనర్‌ సర్జరీలు కలిసి 2021లో 2.57 లక్షల సర్జరీలు జరుగగా, 2022 నాటికి 3.04 లక్షలకు పెరిగాయి. మాతృమరణాల రేటు నియంత్రణ విషయంలో మనం గణనీయమైన వృద్ధి సాధించాం అని అన్నారు. 92 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాల రేటు 39 నుంచి 29కి తగ్గించాం. కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, నాలుగు ఏఎన్‌సీ చెకప్స్‌ తదితర చర్యల ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయి, రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.91 లక్షల మంది మహిళలు కేసీఆర్‌ కిట్ల ద్వారా లబ్ధి పొందారు.  వంద శాతం సురక్షిత ఇనిస్టిట్యూషన్ డెలివరీలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం రిపోర్టు విడుదల చేసింది. దేశంలో అవుతున్న డెలివరీల్లో 89 శాతం మాత్రమే వైద్య నిపుణులు చేస్తే, తెలంగాణలో వంద శాతం చేస్తున్నట్లు స్పష్టం చేసిందన్నారు. టీచింగ్, రీసెర్చ్, ట్రీట్ మెంట్ బాధ్యతలు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై ఉన్నాయి. ఎవరైనా పరిశోధనలు చేయాలని అనుకుంటే సదుపాయాలు కల్పిస్తాం. దేశంలోనే ఉత్తమ పరిశోధనలు మన రాష్ట్రంలో జరగాలని కోరుకుంటున్నాను. వైద్యరంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటే యూపీ చిట్టచివరి స్థానంలో ఉంది.తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే డబుల్ ఇంజన్ సర్కారు వల్ల కాదు.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే సత్తా ఉన్న సింగిల్ ఇంజన్ సర్కారు వల్ల. తెలంగాణ అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రం ఏర్పడటం వల్ల, ఏర్పడ్డ రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ గారు ఉండడంవల్లనే అన్నారు.