ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తల పెట్టి.. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009, నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటిదాకా నడుస్తున్న శాంతియుత ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధంలా మారిందన్నారు. మొత్తం ప్రజలని ఏకంచేసి, నాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్‌గా జరుపుకోవడం, ఆనాటి ఆ కెసిఆర్ త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమేనని చాటారు. తెలంగాణ సాధించిన కేసీఆర్.. ముఖ్యమంత్రిగా అదే ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నారని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని అద్భుతమైన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ త్యాగ నిరతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.