mt_logo

కేంద్రం మొండిచెయ్యి చూపినా తెలంగాణ‌లో రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీ..నేడు సీఎం కేసీఆర్ చేతుల‌మీదుగా ప్రారంభం

  • వెయ్యి కోట్లతో రంగారెడ్డి జిల్లాలో ఫ్యాక్టరీని నిర్మించిన మేధా
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి

హైద‌రాబాద్‌: ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. వరంగల్‌ జిల్లాలోని కాజీపేటలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని మాటిచ్చినప్ప‌టికీ ఆ త‌ర్వాత మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రూ.40 కోట్ల నిధులను సమకూర్చినప్పటికీ కేంద్రం నుంచి అతీగతీ లేదు. 2016లో అప్పటి రైల్వే మంత్రి మనోజ్‌సింగ్‌ తెలంగాణలో కోచ్‌ ఫ్యాక్టరీని స్థాపించే అవకాశం లేదని తేల్చి చెప్పారు.దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సర్కారు ప్రైవేట్‌ సంస్థలను ప్రోత్సహించింది. ఈక్రమంలోనే మేధా ఇక్కడ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆ సంస్థకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వం అనతికాలంలోనే రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ క‌ల‌ను సాకారం చేసి చూపించింది.

రైల్ కోచ్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఒకటైన ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని కొండగల్‌ వద్ద మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించబోతున్నారు. రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,200 మందికి ఉపాధి లభించనున్నది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్రం విస్మరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేసి తెలంగాణ గడ్డపై ప్రైవేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని సాధ్యం చేసి చూపించింది. ప్రపంచ పరిశ్రమల, దిగ్గజ కంపెనీల అడ్డగా మారిన తెలంగాణ…రైల్‌ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలుస్తున్నది.

ప్రైవేట్‌లో అతిపెద్దది ఇదే..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఇప్పటికే జర్మనీకి చెందిన సీమెన్స్‌ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కోచ్‌ ఫ్యాక్టరీని నెలకొల్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సీఆర్‌ఆర్‌సీ ఇండియా ఫ్యాక్టరీని స్థాపించి మెట్రో రైళ్లకు రూపకల్పన చేస్తున్నది. ప్రస్తుతం కొండగల్‌లో ప్రారంభమవుతున్న ఫ్యాక్టరీ దేశంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటైన కోచ్‌ ఫ్యాక్టరీల్లో మూడోదిగా నిలుస్తోంది. దేశీయంగా రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కార్‌ ప్రైవేట్‌ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించింది. కేంద్రం ఐదు రైల్‌ కోచ్‌లు నిర్వహిస్తుండగా, ప్రైవేట్‌ సంస్థలు ముందుకొచ్చి మూడు ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కొండగల్‌ వద్ద 150 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో అన్ని రకాల రైల్వే కోచ్‌లు తయారుకానున్నాయి. ఏటా 500 కోచ్‌లు, 50 లోకోమోటవ్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ఉన్నది.

ప్రారంభానికి ముందే రూ.600 కోట్ల ఆర్డర్‌

-కొండగల్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముందే రూ.600 కోట్ల ఆర్డర్‌ను పొందింది. 

-ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి ఈ ఆర్డర్‌ వచ్చినట్లు మేధా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

-మోనో రైలు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా 10 మోనో రైల్‌ రేక్స్‌ కోసం ఆర్డర్‌ ఇచ్చినట్లు వివరించారు. 

-ఈ ఆర్డర్‌ విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందన్నారు.

-ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు ఆగస్టు 2020లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

-టీఎస్‌ఐఐసీ ద్వారా భూములు కేటాయించి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందించింది.

-మేధాకు భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది.