వీరులారా వందనం విద్యార్థి.. అమరులారా వందనం పాదాలకు.. మా త్యాగధనులారా మరిచిపోము మేము..గుండెల్లో గుడికడతాం.. పోరదండం పెడతాం.. ఇది యావత్తు తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో పాడుకొన్న పాట. ఆనాడు మనం అమరుల ఆశయసాధనకు ఏమేం చేస్తామన్నామో వాటన్నింటినీ స్వరాష్ట్రంలో చేసి చూపిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను అక్కున చేర్చుకొని అండగా నిలువడమే కాదు.. అమరుల స్ఫూర్తి.. ప్రజ్వలిత దీప్తిలా తరతరాలకు స్పూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున స్మారక చిహ్నం నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఆయన చేతుల మీదుగా ‘తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమం జరుగనున్నది. హైదరాబాద్ నడిబొడ్డున యావత్తు తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. త్యాగధనుల ఆశయాలు నిత్యం స్ఫురణకు వచ్చేలా ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది. తద్వారా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం నిత్యం నివాళి అర్పించనున్నది.
నేటి కార్యక్రమాలు ఇవే..
-అమరుల స్మారకం ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
-రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు తదితర విభాగాల అధికారులు ప్రారంభ ఏర్పాట్లను సమీక్షించారు.
-సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి 6 వేల మంది కళాకారులతో స్మారక చిహ్నం వరకు ప్రదర్శన నిర్వహిస్తారు.
-సాయంత్రం 6:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకొంటారు.
-అనంతరం 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ ఉంటుంది.
-ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
-అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభిస్తారు.
-ఆ వెంటనే సభావేదికపైకి చేరుకొంటారు.
-అమరులకు నివాళిగా గేయాలను ఆలపిస్తారు.
-సభలో 10వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పిస్తారు.
-అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
-ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానిస్తారు.
-లేజర్, 800 డ్రోన్లతో షో నిర్వహించనున్నారు.